Kaushik Reddy
Gellu Srinivas yadav : రాబోయే కాలానికి మన ఎమ్మెల్యే గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇళ్ళందుకుంటలో బుధవారం నిర్వహించిన హుజూరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కౌశిక్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ గెలుస్తాడని రేవంత్ రెడ్డి చేప్పినందుకు తాను టీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. శ్రీనివాస్ ను గెలిపించి కేసీఆర్ కీ గిఫ్ట్ ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ మీకు ఏం అన్యాయం చేశారు? ఏం తక్కువ చేశారు? అని ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు. ఈటల రాజేందర్.. మంత్రి పదవి కాదు సీఎం కావాలనుకున్నాడని పేర్కొన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వలే గానీ ఆయన పెద్ద ఇళ్ళు కట్టుకున్నాడని విమర్శించారు. ఇప్పుడు దళిత బంధు, గతంలో రైతు బంధు ఈ గడ్డ మీదనే ప్రారంభించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కాగా సీఎం కేసీఆర్.. కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించారు.
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అందరూ ఊహించనట్టే ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం (ఆగస్టు 11, 2021)న ప్రకటించారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించగానే గెల్లు శ్రీనివాస్ కు అభినందనలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
బీసీ నేతగా ఈటల రాజేందర్ ప్రజల్లోకి వెళ్తుండడంతో ఆయనకు చెక్ పెట్టేందుకు బీసీ నేత గెల్లు శ్రీనివాస్ ను ప్రయోగించాలని టీఆర్‌ఎస్ భావించింది. ఉద్యమం సమయం నుంచే టీఆర్‌ఎస్‌వీలో క్రియాశీలకంగా పని చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ది హుజూరాబాద్ నియోజకవర్గం. అలాగే గెల్లు శ్రీనివాస్ ఉన్నత విద్యావంతుడు కావడం విశేషం.
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో గెల్లు శ్రీనివాస్ విద్యార్థి దశ నుంచే బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడారు. మంచి విద్యార్థి నేతగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్‌ఎస్‌వి తరపున ఉద్యమానికి నాయకత్వం వహించారు.