రోడ్డు రోడ్డుకో ‘ఆధార్ నెంబర్..‘ జీహెచ్ఎంసీ ఖతర్నాక్ ప్లాన్.. ఇక..

జీహెచ్ఎంసీ త్వరలో అధునాతన టెక్నాలజీతోకూడిన ఆబ్లిక్ కెమెరాలను అందుబాటులోకి తేనుంది.

GHMC Roads

GHMC: జీహెచ్ఎంసీలో రోడ్ల మరమ్మతుల పేరిట ప్రతీయేటా వందల కోట్లు ఖర్చవుతున్నాయి. అయితే, కొందరు కాంట్రాక్టర్లు వేసిన రోడ్డునే వేయడం, రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లేకపోవటం.. నామమాత్రంగా రోడ్డుపై లేయర్ వేసి బిల్లులు ఎత్తుకోవటం వంటివి చేస్తున్నారు. వీరికి కొందరు అధికారులు సహకరిస్తూ జేబులు నింపుకుంటున్నారు. తద్వారా జీహెచ్ఎంసీ నిధులు దుబారా అవుతున్నాయి. భవిష్యత్ లో నాణ్యతలేని పనులకు, నిధుల దుబారాకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ అధునాతన సాంకేతికత వినియోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆబ్లిక్ కెమెరాలను అమర్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 

జీహెచ్ఎంసీలో మొత్తం 9013.01 కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. వీటిలో సీసీ రోడ్లు 6166.55 కిలో మీటర్లు, బీటీ రోడ్లు 2846.46 కిలో మీటర్ల మేర ఉన్నాయి. వాటిలో ఏ రోడ్డును ఎప్పుడు వేశారో, రోడ్డుపైన ఎన్ని పొరలుగా బీటీలు వేశారో తెలియదు. ఎన్నిసార్లు పాట్ హోల్స్ పూడ్చివేత పేరిట జీహెచ్ఎంసీ ఖజానాకు చిల్లులు పెట్టారో తెలియదు. రాబోయే కాలంలో ఈ పరిస్థితి మారనుంది. అధునాతన టెక్నాలజీతో ప్రతిరోడ్డుకు ఒక ఐడీ నెంబర్ రానుంది. అంతేకాదు.. ఇకపై ఆ రోడ్డు పేరిట జరిగే పనులన్నీ ఆన్ లైన్ లో నమోదు కానున్నాయి. ఈ ఐడీ నెంబర్ ను ఎంటర్ చేస్తే ఆ రోడ్డు చరిత్ర మొత్తం తెలుస్తోంది.

 

ఆబ్లిక్ కెమెరాలతో రోడ్డు దిగువన ఏముందో కూడా తెలుస్తోంది. ఈ కెమెరాలు వివిధ ప్రాంతాల నుంచి ఏటవాలు కోణాల్లోంచి (దాదాపు 40-45 డిగ్రీల) ఫొటోలు తీస్తాయి. దీంతో రోడ్లు ఎన్ని పొరలుగా, ఎంత పైకి పెరిగాయో తెలుసుకునే వీలుంటుంది. మొత్తం ఎన్ని పొరలు వేశారో తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ఏటవాలుగా తీసే చిత్రాలతో భూమి లోతున ఎంత అడుగు వరకు రోడ్డేశారన్నది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

 

ఈ ఆబ్లిక్ కెమెరాల వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. వరదలు వంటివి వచ్చినప్పుడు రోడ్డు ఎంత మేరదెబ్బతింది. ఏర్పడ్డ పగుళ్లు, పాట్ హోల్స్ వంటివి స్పష్టంగా తెలుస్తాయి. నిర్మాణ పరంగా లోపాలున్నా వెల్లడవుతాయి. దాంతో అడ్డగోలుగా మరమ్మతుల వ్యయం పెంచకుండా ఉండటమే కాక జరిగిన పనుల నాణ్యతసైతం తెలుస్తుంది.