గో కార్టింగ్ జోన్ : శ్రీవర్షిణి మృతి, ఎవరిదీ నిర్లక్ష్యం

  • Publish Date - October 9, 2020 / 11:25 AM IST

Go Karting Zone : హైదరాబాద్‌ గో కార్టింగ్‌ ప్లేజోన్‌లో జరిగిన ప్రమాదంలో శ్రీవర్షిణి మృతి చెందింది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న శ్రీ వర్షిణి సరదాగా ఎంజాయ్ చేసేందుకు గుర్రంగూడ గో కార్టింగ్ ప్లే జోన్‌కు వెళ్లింది. తన బాబాయ్‌తో పాటు ప్లే జోన్ లో ఉన్న కారులో కాసేపు రౌండ్స్ వేద్దామనుకుంది.



బాబాయ్ కార్ డ్రైవింగ్ చేస్తుండగా శ్రీ వర్షిణి పక్కనే కూర్చుంది. కారులో ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోవడంతో శ్రీ వర్షిణికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
కారులో వెళ్తున్న సమయంలోనే శ్రీవర్షిని తల వెంట్రుకలు కారు టైరుకు చుట్టుకోవడంతో.. హెల్మెట్ ఒక్కసారిగా పడిపోయింది.



ఆ తర్వాత శ్రీవర్షిని కూడా కిందపడిపోయింది. తలకు తీవ్రంగా గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శ్రీవర్షిని మృతి చెందింది. అయితే గో కార్టింగ్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. గో కార్టింగ్‌ నిర్వాహకులపై మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.



గోకార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యమే తన చెల్లిని బలి తీసుకుందని శ్రీవర్షిణి అన్నయ్య నరేశ్ ఆరోపిస్తున్నారు. చెల్లి, బాబాయ్ ఇద్దరు కారులో ఉన్నారని.. బాబాయ్ డ్రైవ్ చేశారని చెప్పారు. కారులో వెళ్తుండగా వర్షిణి హెల్మెట్ పడిపోవడంతో వెంట్రుకలు టైరులో చిక్కుకున్నాయన్నారు. ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపాడు.



తాము అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని గో-కార్టింగ్‌ యాజమాన్యం చెప్పింది. శ్రీ వర్షిణితో పాటు వాళ్ల బాబాయ్‌ కార్టన్‌కు వచ్చినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే కార్టిన్‌ ఇచ్చామన్నారు. ఇద్దరూ హెల్మెట్ పెట్టుకొని ఒకే వెహికల్‌పై వెళ్లారన్నారు. అయితే ఒక రౌండ్‌ ముగిశాక రెండో రౌండ్‌లో శ్రీ వర్షిణి హెల్మెట్‌ తీసి సెల్ఫీ కోసం ప్రయత్నించినట్లు కిరణ్ చెబుతున్నాడు.



దీంతో ఆమె వెంట్రుకలు టైర్‌లో చిక్కుకున్నాయని.. ఆ సమయంలోనే ఆమె కిందపడినట్లు తెలిపారు. గత మూడేళ్లుగా కార్టిన్‌ నిర్వహిస్తున్నామని.. ఇప్పటివరకూ ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.