TTD
Tirumala: ఏపీలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివాని దర్శించుకునేందుకు ప్రతీరోజూ వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచేకాక దేశంలోని నలుమూలల నుంచి, ప్రపంచ దేశాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తుంటారు. అయితే, గతంలోలా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను టీటీడీ పట్టించుకోవటం లేదని సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలపై తెలంగాణ ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెబ్ సైట్ ద్వారా జారీ చేసిన సిఫారసు లేఖలు మాత్రమే ఇకపై తిరుమలలో చెల్లుబాటు అవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శుక్రవారం పంపించారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుకు ప్రజాప్రతినిధులు వినియోగిస్తున్న లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ తోనే ఈ పోర్టల్ లో లాగిన్ అయ్యేలా ఏర్పాటు చేశారు.
Also Read: Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి..
ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం..
♦ తిరుమల దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలు https://cmottd.telangana.gov.in ఈ పోర్టల్ ద్వారానే జారీ చేయాల్సి ఉంటుంది.
♦ ఈ పోర్టల్ ద్వారా ఇచ్చే లేఖలకు బ్రేక్ దర్శనం, రూ.300 దర్శనం తిరుమలలో అందుతుంది.
♦ ఈ పోర్టల్ ద్వారా ఇవ్వని లేఖలను టీటీడీ అధికారులు అంగీకరించరు.
♦ ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలను ఈ పోర్టల్ ద్వారా జారీ చేయడంతోపాటు సంతకం చేసి, స్కాన్ చేసి పోర్టల్ లో అప్ లోడ్ చేసిన తరువాత భక్తుల సిఫారసు లేఖలకు సంబంధించిన ఒరిజినల్ కాపీని ఇవ్వాలి.
♦ పోర్టల్ లోకి వెళ్లిన తరువాత టీటీడీ దర్శనం ఎంట్రీ డిటెయిల్స్, పబ్లిక్ రిప్రంజటేటివ్ రిక్వెస్ట్ లోకి వెళ్లి వివరాలు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
♦ ప్రజాప్రతినిధులు ఇచ్చిన ఒరిజినల్ లెటర్ ను, ఆధార్ జిరాక్స్ తోపాటు తిరుమలలో అధికారులు సూచించిన కౌంటర్ లో అందజేయాల్సి ఉంటుంది.