Goshamahal Constituency: రాజాసింగ్ ఇలాఖాలో తడాఖా చూపేదెవరో.. గోషామహల్‌లో గులాబీ జెండా ఎగిరేనా?

కొరకాని కొయ్యగా మారిన గోషామహల్‌లో.. ఈసారి ఎలాగైనా గెలుపు జెండా ఎగరేయాలని.. అటు బీఆర్ఎస్, ఇటు ఎంఐఎం తహతహలాడుతున్నాయి. ఈ మేరకు.. రెండు పార్టీలు ఎవరికి వారు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి.

Goshamahal Assembly constituency Ground Report

Goshamahal Assembly constituency: గోషామహల్.. హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. ఈ నియోజకవర్గం ప్రస్తావన వస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగే గుర్తొస్తారు. అలాగని ఈ సెగ్మెంట్‌లో బీజేపీని మించిన పార్టీ మరొకటి లేదని కాదు. ఇక్కడ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS Party) కూడా బలంగానే ఉన్నాయ్. ప్రతిసారీ.. గెలుపు కోసమే పోరాడుతున్నా.. ఫలితం దక్కట్లేదు. ఈసారి కూడా బీజేపీ నుంచే హ్యాట్రిక్ కొట్టేందుకు రాజాసింగ్ చూస్తుంటే.. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ (Congress Party) తహతహలాడుతోంది. ఇక.. గోషామహల్‌లో గులాబీ జెండా పాతేందుకు.. అధికార పార్టీ పావులు కదుపుతోంది. దాంతో.. రాజాసింగ్ (Raja Singh) ఇలాఖాలో తడాఖా చూపే పార్టీ ఏదన్నది ఆసక్తిగా మారింది.

ఇప్పుడు మనం చూస్తున్న గోషామహల్ నియోజకవర్గం.. ఒకప్పుడు మహరాజ్ గంజ్‌ (Maharaj Gunj )గా పిలిచిన అసెంబ్లీ సెగ్మెంట్. 2009లో ఈ గోషామహల్ సెగ్మెంట్ ఏర్పడింది. ఇక్కడ.. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీలదే హవా. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడ్(Mukesh Goud) ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో.. వరుసగా బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలుస్తూ వస్తున్నారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు, అన్ని మతాలు, వర్గాలకు చెందిన వాళ్లతో.. గోషామహల్ మినీ ఇండియాను తలపిస్తుంది. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2 లక్షల 82 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో సగానికి పైగా సెటిలర్సే ఉంటారు. ఇక్కడ.. గెలుపోటములను నిర్ణయించేది కూడా వాళ్లేననే టాక్ ఉంది. ఇక.. ముస్లింలు 60 వేలు, క్రిస్టియన్లు 17 వేలు, ఎస్సీ, బీసీలు.. 73 వేల మంది దాకా ఉన్నారు.

గోషామహల్ రాజధాని నగరంలో హోల్ సేల్ వ్యాపారాలకు సెంటర్ పాయింట్‌గా ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో ఆరు గ్రేటర్ హైదరాబాద్ డివిజన్లు ఉన్నాయి. అవి.. బేగంబజార్, గన్ ఫౌండ్రి, జాంబాగ్, గోషామహల్, మంగళ్‌హాట్, దత్తాత్రేయనగర్. ఇక.. రాష్ట్ర రాజకీయాలకు.. కేంద్రంగా ఉండే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల ఆఫీసులు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంటాయి. అందువల్ల.. గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ హైదరాబాద్‌కు గుండెకాయలాంటిదని చెప్పొచ్చు. అయితే.. ఇప్పటివరకు ఎంఐఎం నేరుగా ఇక్కడి నుంచి పోటీ చేయలేదు. గోషామహల్ అంటే.. రాజాసింగ్ అడ్డా అనే పేరుంది. గత రెండు ఎన్నికల్లో ఆయనే ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు.

రాజాసింగ్ (photo: facebook)

బీజేపీలో ఫైర్ బ్రాండ్‌ లీడర్‌గా పేరున్న రాజాసింగ్.. వివాదాలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నియోజకవర్గంలో సెటిలర్ ఓటర్లే ఎక్కువగా ఉండటంతో.. ఇక్కడి ప్రజలు లోకల్, నాన్ లోకల్ ఫ్యాక్టర్‌ని పెద్దగా పట్టించుకోరనే చెప్పాలి. ఇందుకు.. రాజాసింగే బిగ్ ఎగ్జాంపుల్. నార్త్ ఇండియా నుంచి వచ్చి.. ఇక్కడ స్థిరపడిన లోధి వంశస్తుడు రాజాసింగ్. గోషామహల్ పరిధిలో లోధి వంశస్థుల ఓట్ బ్యాంక్ దాదాపు 30 వేలుగా ఉండటం.. రాజాసింగ్‌కు కలిసొస్తోంది. అదే.. ఆయన్ని వరుసగా రెండు సార్లు గెలిపించిందనే వాదనలున్నాయి. ఈసారి.. హ్యాట్రిక్ కోసం ఆయన ఆరాటపడుతున్నారు.

విక్రమ్ గౌడ్ (photo: facebook)

ఇక.. గోషామహల్ బీజేపీ టికెట్ రేసులో.. ఇద్దరు, ముగ్గురు కీలక నేతలున్నారు. వారిలో.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ (Vikram Goud), భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్ రావు(Bhagavanth Rao), జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న శంకర్ యాదవ్ (Shankar Yadav).. కమలం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు.. గోషామహల్‌పై రాజకీయంగా పట్టున్న వారు కావడంతో.. అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ రాజాసింగ్‌ను ఎంపీగా పోటీ చేయిస్తుందని.. దాంతో.. తమకే పోటీ చేసే అవకాశం వస్తుందని.. ఎవరి లెక్కల్లో వాళ్లున్నారు.

నందకిశోర్ వ్యాస్ (photo: facebook)

ఇక.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. గత రెండు ఎన్నికల్లో గోషామహల్ బరిలో నిలిచినా.. ఆ పార్టీ గెలవలేకపోయింది. దాంతో.. ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది గులాబీ పార్టీ. అయితే.. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో నందకిశోర్ వ్యాస్ (Nand Kishore Vyas Bilal), ఆశిష్ కుమార్ యాదవ్ (Ashish Kumar Yadav), ముఖేష్ సింగ్, ఆనంద్ కుమార్ గౌడ్ (Anand Kumar goud) ఉన్నారు. వీళ్లంతా.. ఎవరికి వారు.. వాళ్ల స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కచ్చితంగా.. గోషామహల్‌లో గెలుపు జెండా ఎగరేస్తామని నమ్మకంగా ఉన్నారు.

మెట్టు సాయికుమార్ (photo: facebook)

కాంగ్రెస్ విషయానికొస్తే.. గోషామహల్ నుంచి మెట్టు సాయికుమార్ (Mettu Sai Kumar) పోటీ చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ బీజేపీలో చేరడం మెట్టు సాయికి కలిసొస్తుందనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. అంతేకాదు.. ఆయన ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం.. వాళ్ల ఓట్ బ్యాంక్ 28 వేలుగా ఉండటం కూడా మరో ప్లస్ పాయింట్‌గా చెబుతున్నారు. దీనికి తోడు.. కాంగ్రెస్‌కు ఉండే సంప్రదాయ ఓట్ బ్యాంక్, గోషామహల్ పరిధిలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి కూడా కలిసి వస్తుందనే నమ్మకం.. కాంగ్రెస్ క్యాడర్‌లో కనిపిస్తోంది.

Also Read: ఒకసారి గెలిచిన వారు రెండోసారి ఎమ్మెల్యే కాలేదు.. బీఆర్‌ఎస్‌ లో రెండు వర్గాలు.. ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్

గోషామహల్‌లో గెలుపు జెండా ఎగరేసేందుకు.. ఏ పార్టీకి ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఈ ప్రాంతంలో ప్రధానంగా డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్ సమస్యలున్నాయి. దీనికితోడు అధికారులు వేసే ట్యాక్స్‌లతో.. వ్యాపార వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటికి పరిష్కారం దొరకాలంటే.. నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలని గోషామహల్ ఓటర్లు కోరుకుంటున్నారు. ఈ ప్రాంతమంతా.. వ్యాపార కేంద్రంగా ఉండటంతో.. ఇక్కడ డబ్బు ప్రభావం పెద్దగా ఉండదనే చర్చ ఉంది. కాబట్టి.. అందుబాటులో ఉండే నాయకుడి కోసమే ఇక్కడి ప్రజలు చూస్తున్నారు.

Also Read: కామారెడ్డిలో గంప గోవర్దన్‌కు టికెట్ దక్కుతుందా.. బీఆర్ఎస్ టిక్కెట్ పైనే గెలుపోటములు!

ఈ పరిస్థితుల్లో.. హ్యాట్రిక్ కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తుంటే.. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టేసింది. ఇక కొరకాని కొయ్యగా మారిన గోషామహల్‌లో.. ఈసారి ఎలాగైనా గెలుపు జెండా ఎగరేయాలని.. అటు బీఆర్ఎస్, ఇటు ఎంఐఎం తహతహలాడుతున్నాయి. ఈ మేరకు.. రెండు పార్టీలు ఎవరికి వారు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో.. మినీ ఇండియాలో.. మెగా ఇంపాక్ట్ చూపి.. గోషామహల్ బాద్ షా‌గా ఎవరు అవతరిస్తారన్నది.. ఆసక్తి రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు