Congress Cold War: కలహాలు కాంగ్రెస్‌లో సీరియల్ ఎపిసోడ్ అయిపోయాయి. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రచ్చ రగులుతూనే ఉంది. ఇక మంత్రుల మధ్య డైలాగ్ వార్ హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మరో మంత్రి..ఇంకో కార్పొరేషన్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి మధ్య గ్యాప్ నడుస్తోందట. శాఖాపరమైన విషయాల్లో ఇద్దరి మధ్య ఏ మాత్రం సఖ్యత ఉండటం లేదట. వ్యవసాయశాఖ విషయంలో కోదండరెడ్డికి పూర్తి అవగాహన ఉండటమే ఇందుకు కారణమట.
కోదండరెడ్డి కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్‌కు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా పని చేయడంతో పాటు వ్యవసాయశాఖపై పూర్తి పట్టుంది. వ్యవసాయశాఖ పరంగా రైతులకు ఏ సందర్భంలో ఏ విధంగా నిర్ణయాలు ఉండాలనే దానిపై కోదండరెడ్డి నిత్యం జోక్యం చేసుకోవడం ఇప్పుడు వివాదానికి కారణంగా తెలుస్తోంది. విత్తనోత్పత్తి విషయంలో సీడ్ ఆర్గనైజర్ల దోపిడీని నియంత్రించడంతో రైతు కమిషన్ సక్సెస్ అయ్యింది. ములుగులో సీడ్ ఆర్గనైజర్ల వల్ల నష్టపోయిన రైతులకు రైతు కమిషన్ అండగా నిలిచింది. కార్పొరేట్ కంపెనీల నుంచి రైతులకు దాదాపు నాలుగు కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించింది రైతు కమిషన్. ఈ విషయంలో ప్రభుత్వపరంగా కఠినంగా వ్యవహరించాల్సిన వ్యవసాయశాఖ కన్నా కూడా రైతు కమిషనే ముందుండటంతో విమర్శలు వెల్లువెత్తాయి.
ఒక ములుగులోనే కాదు సీడ్ ఆర్గనైజర్ల విషయంలో సూర్యాపేటలో వరి, ఖమ్మంలో మిర్చి, గద్వాల్ పత్తి విత్తన కంపెనీలపై రైతు కమిషన్ గ్రౌండ్ లెవల్‌లో సమీక్షలు చేసింది. ఇలా వ్యవసాయశాఖ చేయాల్సిన పనులను రైతు కమిషనే చేస్తుండటంపై మంత్రి తుమ్మల గుర్రుగా ఉన్నారన్న టాక్ నడుస్తోంది. సంబంధిత శాఖ మంత్రిగా తాను సమీక్ష చేయాల్సిన అంశాలను రైతు కమిషన్ చేయడమేంటని తుమ్మల మండిపడుతున్నారని తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో పత్తి కొనుగోళ్ల విషయంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కూడా ముందుగా రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి సమీక్ష చేసి..రైతుల పక్షాన సలహాలు, సూచనలు ఇచ్చారు. దీంతో సేమ్ డే..రాత్రికి రాత్రి వ్యవసాయశాఖ నుంచి ఒక ప్రెస్‌నోట్ రిలీజ్ చేయించారు. తర్వాత రోజు సెక్రటేరియట్ వేదికగా సీసీఐ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష చేశారు.
ఇదంతా ఒక ఎత్తయితే..ప్రభుత్వం సీడ్ పాలసీ విషయంలో ఒక చట్టం తీసుకురావాలని ప్రయత్నం చేస్తోంది. ఈ ఎపిసోడ్ ఇప్పుడు వ్యవసాయశాఖ మంత్రికి.. రైతు కమిషన్ ఛైర్మన్‌కు మరింత గ్యాప్ పెంచేలా చేసిందట. ప్రభుత్వం తీసుకొచ్చే విత్తన చట్టం తమకు ఇబ్బందులకు కలగకుండా ఉండేందుకు లాబీయింగ్ చేస్తున్నాయట సీడ్ కంపెనీలు. అందుకోసం ఒక భారీ కార్యక్రమం చేపట్టి..ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించాలని నిర్ణయించారు.
ఈ లాబీయింగ్ కోసం కాంగ్రెస్ పార్టీలోని కరీంనగర్ జిల్లాలోని ఒక ఎమ్మెల్యేతో ప్రయత్నాలు చేశారట. సదరు ఎమ్మెల్యే కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులను తీసుకొని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి.. సీడ్ కంపెనీలు నిర్వహించే సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి వ్యవసాయశాఖ మంత్రి కార్యాలయం కూడా ఉత్సాహం చూపినట్లు వార్తలు వచ్చాయి.
ఈ కార్యక్రమానికి సీఎం వెళ్తే బాగుండదనే ఆలోచనతో రైతు కమిషన్ రంగంలోకి దిగిందట. తనకున్న మార్గాల ద్వారా జరుగుతున్న వ్యవహారాన్ని సీఎంవోకు చేరవేశారట. విషయం తెలిసిన సీఎం రేవంత్ సీడ్ ఆర్గనైజర్ల కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇలా అటు రైతు కమిషన్…ఇటు వ్యవసాయ శాఖల ఎత్తులు పైఎత్తులతో రైతు రాజకీయం రంజుగా సాగుతుందనే టాక్ వినిపిస్తోంది.