Maganti Sunitha: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి చుట్టూ రాజకీయం.. కొత్త వివాదంలో మాగంటి సునీత..! ఎవరు టార్గెట్ చేస్తున్నారు?
ఆమె ఎన్నికల ప్రచార సభలో తన భర్తను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడంపై.. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.

Maganti Sunitha: మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. గోపినాథ్ అకాల మరణంతో వచ్చిన జూబ్లీహిల్స్ బైపోల్‌లో..బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు మాగంటి సునీత. వాస్తవానికి ఆమెకు ఇష్టం లేకున్నా..బీఆర్ఎస్ అధిష్టానమే ఒప్పించి మరీ పోటీ చేయిస్తుందన్న టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్‌లో ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినా వారి కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తుంటారు గులాబీ బాస్ కేసీఆర్. ఇక్కడ మాగంటి కూతుర్లలో ఒకరిని..లేకపోతే కుమారుడిని పోటీ చేయించాలని అనుకున్నా వాళ్లు వయసురిత్యా చిన్న వాళ్లు కావడంతో.. గోపీనాథ్ సతీమణిని బరిలోకి దించారు.
అయితే సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా తెరమీదకు వచ్చినప్పటి నుంచి..ఏదో విషయంలో ఆమె టార్గెట్ అవుతూ వస్తున్నారు. ప్రత్యర్థులకన్నా ఆమె సొంత ఫ్యామిలీ నుంచే వ్యతిరేకత ఎక్కువగా వ్యక్తం అవుతోంది. మాగంటి గోపినాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్ తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఆయన కొన్ని కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా సునీత మాగంటి గోపినాథ్ సతీమణి కాదంటూ కొత్త చర్చ తెరమీదకు తీసుకొచ్చారు. ఈ వివాదం వెనుక కూడా మాగంటి కుటుంబీకులే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
సునీత.. మాగంటికి భార్య కాదనే ప్రచారం..
సునీత అంటే ముందు నుంచి గిట్టని మాగంటి ఫ్యామిలీ ఇప్పుడు ఏకంగా ఆమె భార్య కాదనే ప్రచారానికి తెరలేపుతోందన్న చర్చ నడుస్తోంది. ఇదే అదునుగా మాగంటి గోపినాథ్ మరో భార్య కుమారుడు ప్రధుమ్న అనే వ్యక్తి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సునీత.. మాగంటి గోపీనాథ్ భార్య కాదని ఆరోపించారు. సునీత నామినేషన్ రద్దు చేయాలని ఈసీకి ప్రధుమ్న వినతి చేశారు. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన తల్లి మాలిని పేరు చూపించకుండా సునీత పేరు పెట్టారని..తన తల్లి మాలినితో గోపీనాథ్‌కు విడాకులు కాలేదని ప్రధుమ్న అంటున్నారు. మాగంటి గోపినాథ్‌తో సునీత లీవ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారన్నది ప్రధుమ్న వాదన.
అయితే గతంలో మాగంటి గోపీనాథ్ అఫిడవిట్స్ అన్నింటిలోనూ తన భార్యగా సునీత పేరునే పేర్కొనే వారు. మరప్పుడు ప్రధుమ్న ఎలాంటి ఫిర్యాదు ఎందుకు చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే మాగంటి గోపీనాథ్‌కు సునీత భార్య అవునా..కాదా అనే విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత తమది కాదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందన్నారు ఎన్నికల అధికారులు. దీంతో మాగంటి సునీత నామినేషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది.
మొన్నటి వరకు మాగంటి సునీత కన్నీళ్ల చుట్టూ రాజకీయం నడిచింది. ఆమె ఎన్నికల ప్రచార సభలో తన భర్తను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడంపై.. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. మాగంటి సునీత సానుభూతి కోసం కన్నీళ్లు కారుస్తున్నారని పొన్నం మాట్లాడిన మాటలు..నెగెటివ్ అయ్యాయి. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయింది. జూబ్లీహిల్స్ జనంలో కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో పలు సర్వేలు బీఆర్ఎస్‌కు అనుకూలంగా రిపోర్టులు ఇస్తుండటంతో పొలిటికల్ సిచ్యువేషన్ హీటెక్కింది. బీఆర్ఎస్ గెలుపు ధీమాతో ఫుల్ జోష్‌లో ఉంది.
ఓటమి భయంతోనే అలాంటి ప్రచారం..?
అయితే ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ దిగజారి వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ మండిపడుతోంది. మాగంటి సునీత కన్నీళ్లపై రాజకీయం చేయడమే కాకుండా..ఆమె కూతుర్లు ప్రచారంలో పాల్గొంటే అక్రమ కేసులు పెడుతున్నారని..ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా మధుమ్న ఫిర్యాదుపై సీరియస్ అవుతోంది. తండ్రి చనిపోతే తలకొరివి పెట్టేందుకు కూడా రాని కొడుకు..ఇప్పుడు నామినేషన్ తిరస్కరించాలని ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా కాంగ్రెస్ ఆడుతున్న గేమ్ అని ఆరోపిస్తోంది.
సరిగ్గా ఇదే టైమ్‌లో సునీత మాగంటి గోపినాథ్ భార్య కాదంటూ ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదు దుమారం లేపుతోంది. ఇప్పటికే ముందస్తు వ్యూహంతో పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డితో నామినేషన్ వేయించి పెట్టింది బీఆర్ఎస్. మొత్తానికి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పేరు తెరమీదకు వచ్చినప్పటి నుంచో ఏదో ఒక ఇష్యూతో ఆమె టార్గెట్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు సునీత మాగంటి సతీమణి కాదంటూ కొత్త చర్చ తెరమీదకు రావడంతో జూబ్లీహిల్స్ పాలిటిక్స్ మరింత హీటెక్కుతున్నాయి.
Also Read: జూబ్లీహిల్స్ తర్వాత గ్రేటర్‌లో మరో ఉపఎన్నిక ఖాయమా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి?