×
Ad

Congress Mlas: ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సైడ్ చేశారా? ఎవరా ఇద్దరు.. జూబ్లీహిల్స్ ప్రచారంలో కనిపించనిది అందుకేనా..

హైద‌రాబాద్‌లోని ఒక ప్రైవేట్ హోట‌ల్‌లో మ‌కాం పెట్టి..అస‌మ్మతి గ‌ళం వినిపిస్తున్నట్లు బ‌య‌ట‌కు వార్తలు రావ‌డంతో సీఎం రేవంత్‌ అసంతృప్తికి గుర‌య్యార‌ట‌.

Congress Mlas: వాళ్లిద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. పైగా ఒకే జిల్లాకు చెందిన వాళ్లు. సీఎం రేవంత్‌ సొంత ఇలాకా పాలమూరు ప్రజాప్రతినిధులు. సొంత సర్కార్‌ నిర్ణయాలు, సీఎం రేవంత్‌ డెసిషన్స్‌ మీద తమ అసంతృప్తి గళం వినిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు పార్టీకి ఇబ్బందిగా మారిందట. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై పార్టీ ముఖ్యనేతలు కూడా గుర్రుగా ఉన్నారా? అందుకే ఆ ఇద్దరు శాసనసభ్యులను దూరం పెట్టాలనుకుంటున్నారా? హస్తం నేతలంతా జూబ్లీహిల్స్‌ ప్రచారంలో బిజీగా ఉన్నా..ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు క్యాంపెయిన్‌లో ఎందుకు కనిపించట్లేదు? ఇంతకు ఎవరా ఇద్దరు? అసలు పాలమూరు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?

ఏడాదికి రూ.25 కోట్లు ఇవ్వాలని డిమాండ్..

తెలంగాణ కాంగ్రెస్ లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరే.. ఏడాదిగా హాట్ టాపికే. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త చర్చకు తెరలేపుతున్నారు. ఈ ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరుకు చెందిన ప్రజాప్రతినిధులు. ఈ మధ్యే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌తో కొత్త చర్చకు తెరలేపారు. ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయిన ఈ 20 నెలల కాలంలో నియోజకవర్గంలో ఒక్క డెవలప్‌మెంట్ చేయలేకపోతున్నామని..నియోజకవర్గానికి ఏడాదికి రూ.25 కోట్ల నిధులు ఇవ్వాలని..అప్పుడే ఎమ్మెల్యేలు గ్రామస్థాయిలో పనులన్నీ దగ్గరుండి చక్కబెట్టుకుంటారని వాయిస్ రేజ్‌ చేశారు యెన్నం.

జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారంలో యెన్నం కామెంట్స్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. పైగా గతంలోనూ కాంగ్రెస్ సర్కార్‌ విధానాలపై పేపర్‌లో ఓ ఆర్టికల్ రాసి చర్చకు తెరలేపారు యెన్నం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి అయితే పార్టీ ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ పెట్టారంటూ ఆరు నెలల కింద పెద్ద చర్చే జరిగింది. సీఎం రేవంత్‌కు వ్యతిరేక వర్గాన్ని తయారు చేస్తున్నారన్న ప్రచారం అప్పటినుంచే ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌కు హెడెక్‌గా మారిందట. దీంతో అటు యెన్నం, ఇటు అనిరుధ్‌రెడ్డిని దారిలోకి తెచ్చుకునేందుకు ఏం చేయాలనేదానిపై కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట.

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఎమ్మెల్యే వైఖరి..

హైద‌రాబాద్‌లోని ఒక ప్రైవేట్ హోట‌ల్‌లో మ‌కాం పెట్టి..అస‌మ్మతి గ‌ళం వినిపిస్తున్నట్లు బ‌య‌ట‌కు వార్తలు రావ‌డంతో సీఎం రేవంత్‌ అసంతృప్తికి గుర‌య్యార‌ట‌. ఆ త‌ర్వాత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఓ ప్రైవేట్ కంపెనీపై ల్యాండ్ విష‌యంలో హైకోర్టు మెట్లు ఎక్కడం..రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కార్నర్ చేస్తూ కామెంట్స్ చేయ‌డం వంటివి రేవంత్‌కు కోపం తెప్పిస్తున్నాయట. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ సీపీగా అప్పట్లో ఉన్న సీవీ ఆనంద్‌పై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోష‌న్ దాఖ‌లు చేస్తామ‌న‌డం ఇవన్నీ పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారాయట.

వీట‌న్నింటికి తోడు ఈ మ‌ధ్య మహబూబ్‌నగర్‌ జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌తో క‌లిసి ఢిల్లీకి వెళ్లి..పార్టీ జాతీయ అధ్యక్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గేను క‌ల‌వ‌డం..ఆ త‌ర్వాత వ‌చ్చిన వార్తల విష‌యంలో సీఎంకు ప‌ట్టరాని కోపం వ‌చ్చింద‌ట‌. దాంతో వాళ్లిద్దరికి స‌మాచారం చేరేలా వార్నింగ్ పంపించిన‌ట్లు పార్టీలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేకాదు ఆ ఇద్దరు ఎమ్మెల్యే వ్యవ‌హారంపై క్యాబినేట్ స‌మావేశంలో కూడా సీఎం గ‌రం గ‌రం అయిన‌ట్లు పెద్ద ఎత్తున ప్రచారం జ‌రిగింది.

సొంత జిల్లా, సొంత సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరుతో సీఎం కాస్త గుర్రుగా ఉన్నార‌ట‌. అందుకే ఆ ఇద్దరిని దారిలోకి తెచ్చుకునేందుకు సీఎం రివ‌ర్స్ గేర్ వేస్తున్నార‌ట‌. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌కు ఈ ఇద్దరిని దూరంగా ఉంచార‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఉమ్మడి పాల‌మూరు జిల్లాలో కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన 12 మందిలో..యెన్నం, అనిరుధ్‌ మిన‌హా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహ‌రిల‌తో స‌హా పది ఎమ్మెల్యేలంతా జూబ్లీహిల్స్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. కానీ సీఎం సొంత జిల్లా పాలమూరుకు చెందిన యెన్నం, అనిరుధ్‌రెడ్డి మాత్రం ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు.

ఈ ఇద్దరికి అసలు జూబ్లీహిల్స్ ప్రచారంలో ఎక్కడా..ఎలాంటి బాధ్యత‌లు అప్పగించ‌లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు పాల‌మూరు పాలిటిక్స్‌లో ఆ ఇద్దరిని సైడ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వారికి ప్రయారిటీ ఇవ్వకుండా..నామ్‌ కే వాస్తే అన్నట్లుగా పేరుకే ఎమ్మెల్యేలు అన్నట్లుగా లైట్ తీసుకుంటున్నారట. పార్టీ ముఖ్యనేతలు కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరుపై గుర్రు మీదున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా అటు యెన్నం, ఇటు అనిరుధ్‌ ఏమాత్రం తగ్గడం లేదట. దీంతో త‌న‌కు త‌ల‌నొప్పిగా మారిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను ఎలా దారిలోకి తెచ్చుకోవాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారట. యెన్నం, అనిరుధ్‌ అసంతృప్తి చల్లారేదెప్పుడు.? ఆ ఇద్దరిని పార్టీ పక్కన పెట్టడం అయ్యే పనేనా? అనేది చూడాలి.

Also Read: మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు.. ఏఏ శాఖలు కేటాయించారంటే..