తెలంగాణ కాంగ్రెస్‌లో నయా పవర్‌ సెంటర్‌? సీఎం రేవంత్ కన్నా ఆ మహిళా నేతకు పలుకుబడి ఎక్కువా?

ఆమె ఆశీస్సులు ఉంటే ప‌నులు చ‌కచక జరుగుతాయనే టాక్‌తో దీప్‌దాస్‌ మున్షితో పరిచయం పెంచుకోడానికి, ఆమె ఆశీస్సులు పొందడానికి నేతలు పోటీపడుతున్నారు.

Deepa Dasmunshi : తెలంగాణ కాంగ్రెస్‌లో నయా పవర్‌ సెంటర్‌ ఆవిర్భవించిందా? ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ పెద్దలు కన్నా…. ఆ మహిళా నేతకు పవర్‌ ఎక్కువా? రెండు రాష్ట్రాల బాధ్యతలు చూడాల్సి ఉన్నా, తెలంగాణపైనే ప్రత్యేక ఫోకస్‌ చేయడానికి ఆ మహిళ నేతకు ఉన్నా ఆసక్తి ఏంటి? టీపీసీసీలో బాహుబలి వంటి సీఎం రేవంత్‌రెడ్డికన్నా ఆ మహిళ నేతకు ఉన్న పవర్‌ ఏంటి?

ఆమె అనుగ్రహం ఉంటే చాలు..
తెలంగాణ రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి సూపర్‌ పవర్‌పై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇన్‌చార్జిగా పార్టీ వ్యవహారాలన్నీ ఆమె కనుసన్నల్లో జరుగుతున్నట్లే… ప్రభుత్వంలోనూ ఆమె జోక్యం చేసుకోవడంపై స్వపక్షం నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో నయా పవర్‌ సెంటర్‌గా మారిన దీప్‌దాస్‌ మున్షీ మెప్పు కోసం నేత‌లంతా ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. ఆమె అనుగ్రహం ఉంటే చాలు ప‌నుల‌న్ని ఇట్టే చ‌క్క బెట్టుకోవచ్చని నేతలు పోటీ పడుతున్నారని చెబుతున్నారు.

అధిష్టానానికి పార్టీ ఇన్‌చార్జులే క‌ళ్లు, చెవులు..
కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం పార్టీ హైక‌మాండ్ ప్రతీ రాష్ట్రానికి ఇన్‌చార్జ్‌ల‌ను, స‌హ ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మిస్తుంటుంది. ఇలా నియ‌మించిన ఇన్‌చార్జ్‌లే రాష్ట్ర వ్యవ‌హారాల‌ను పార్టీ అధిష్టానానికి చేర‌వేస్తుంటారు. ఒక్కమాట‌లో చెప్పాలంటే పార్టీ అధిష్టానానికి ఇన్‌చార్జులే క‌ళ్లు, చెవులు అన్న మాట‌. ఇన్‌చార్జ్‌లు చెప్పిందే పార్టీ అధిష్టానం వ‌ద్ద చెల్లుబాటు అవుతుంది. అందుకే వారికి అంత ప్రియారిటీ ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ‌లో ఇన్‌చార్జి అధికారాలు చాలానే ఉంటాయి. పార్టీ వ్యవ‌హారాల విష‌యంలో ఇన్‌చార్జ్ మాట‌కే ఎక్కువ విలువ ఉంటుందని టాక్‌. దీన్ని అదునుగా చేసుకొని తెలంగాణ ఇన్‌చార్జిగా దీపాదాస్ మున్షి చ‌క్రం తిప్పుతున్నార‌ని ప్రచారం జరుగుతోంది.

పట్టుబట్టి టికెట్లు ఇప్పించుకున్న దీపాదాస్ మున్షీ..
రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరంగా ఏ ప‌ని జ‌ర‌గాల‌న్నా ఇన్‌చార్జి అనుగ్రహం ఉంటే ఇట్టే జ‌రిగిపోతున్నాయ‌ంటున్నారు. పార్టీలో తనకు అనుకూలంగా ఉన్న వారి ప‌నులు చ‌క‌చ‌క జ‌రిగేలా దీపాదాస్‌ మున్షీ సహకరిస్తున్నారని, ఆమెకు న‌చ్చక‌పోతే కొర్రీలు విధిస్తున్నార‌ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అభ్యర్థుల ఎంపికపైనా ఆమె జోక్యం చేసుకున్నార‌ని తెలుస్తోంది. దీప్‌దాస్‌ మున్షీ మరో పవర్‌ సెంటర్‌గా మారుతున్నా, రాష్ట్రంలోని ముఖ్యనేత‌లు సైతం ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతున్నారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కొంద‌రికి ప‌ట్టుబ‌ట్టి టికెట్లు ఇప్పించారంటే అధిష్టానంలో ఆమె పరపతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని అంటున్నారు. ఇక ప్రభుత్వపరంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప‌నులు సైతం దీపాదాస్ డీల్ చేసి, పరిష్కరించారని అంటున్నారు.

కేరళ కన్నా తెలంగాణపైనే ఫోకస్ ఎక్కువ..
వాస్తవానికి దీపాదాస్ మున్షికి తెలంగాణ ఇన్‌చార్జిగా పూర్తి స్థాయి బాధ్యత‌లు అప్పగించలేదు. కేర‌ళ కాంగ్రెస్‌కు కూడా దీప్‌దాస్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఇన్‌చార్జిగా మాణిక్‌రావు ఠాక్రేను త‌ప్పించిన త‌ర్వాత‌.. దీపాదాస్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆమె కేర‌ళ‌ రాష్ట్రాన్ని ప‌ట్టించుకోకుండా.. కేవలం తెలంగాణ‌లోనే మ‌కాం పెట్టారు. జూబ్లీహిల్స్‌లో ప్రత్యేకంగా ఇల్లు తీసుకొని ఇక్కడే ఉంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి వచ్చిన దీప్‌దాస్‌ మున్షి, ఇప్పుడు ప్రతి విష‌యంలో జోక్యం చేసుకుంటుండటంతో పార్టీలోనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.

దీపాదాస్ ఆశీస్సుల కోసం ఓ మంత్రి ప్రయత్నాలు..!
పార్లమెంట్ ఎన్నిక‌ల ముందు ప్రభుత్వం నామినేట్ పోస్టులను భర్తీ చేయాలని భావించింది. ఆ విష‌యంలో దీప్‌దాస్‌ మున్షి జోక్యం చేసుకోవడం వల్ల పదవుల భర్తీ ఇప్పటికీ కొలిక్కి రాలేదంటున్నారు. కేబినేట్ విస్తర‌ణ‌, పీసీసీ కొత్త అధ్యక్షుడి విష‌యంలో ఆమె ఆశీస్సులు ఉంటే ప‌నవుతుంద‌ని… నేత‌లంతా ఆమె చుట్టే ప్రద‌ర్శన‌లు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఓ మంత్రి సైతం ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ ఆశీస్సుల కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కొన్ని వివాదాల్లో చిక్కుకున్న మంత్రి.. అధిష్టానం అండ కోసం ఇన్‌చార్జితో ఎక్కువగా టచ్‌లో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.

మొత్తం మీద టి.కాంగ్రెస్‌లో ఇంచార్జ్ దీపాదాస్ మున్షి ఫుల్ ప‌వ‌ర్ సెంట‌ర్‌గా మారారన్నదే గాంధీభవన్‌ టాక్‌. ఆమె ఆశీస్సులు ఉంటే ప‌నులు చ‌కచక జరుగుతాయనే టాక్‌తో దీప్‌దాస్‌ మున్షితో పరిచయం పెంచుకోడానికి, ఆమె ఆశీస్సులు పొందడానికి నేతలు పోటీపడుతున్నారు.

Also Read : నాది జగన్ తరహా పాలన కాదు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు