Defected MLAs: జంపింగ్ ఎమ్మెల్యేల ఇష్యూలో రోజుకో అప్ డేట్.. పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను తలపిస్తోంది. స్పీకర్ పది మందికి నోటీసులు ఇచ్చారు. అందులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదంటూ తేల్చి చెప్పేశారు. కొందరు దేవుడి కండువా కప్పుకుంటే..మరికొందరు ఫోటోలు మార్ఫింగ్ చేశారని స్పీకర్ కు రిప్లయ్ ఇచ్చారు. కానీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం వివరణ ఇవ్వడానికి ఇంకా టైమ్ కావాలని అడిగారట. ఎనిమిది మంది ఎమ్మెల్యేల వివరణపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి.? ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇరికిపోయినట్లేనా.? వేటు పడుతుందని డిసైడ్ అయ్యారా..?
ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యేలు ఇచ్చిన రిప్లై ఆసక్తికరంగా మారింది. పది మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు..సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అందులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చారు. వాళ్లిచ్చిన వివరణే ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పుకొచ్చారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావులు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు తమ ఫోటోలు మార్ఫింగ్ చేశారని కూడా ఒకరిద్దరి ఎమ్మెల్యేల వాదన.
నేను పార్టీ మారలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను. నేనెక్కడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామంటూ ఎనిమిది మంది ఒకేలా రిప్లై ఇచ్చారట. వారి వివరణకు స్పీకర్ స్యాటిస్ ఫై అయ్యే అవకాశం ఉంది. తాము పార్టీ మారలేదని చెప్పడమే కాదు..బీఆర్ఎస్‌లోనే ఉన్నామంటున్నారు కాబట్టి..ఈ ఎనిమిది ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎటొచ్చి ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలోనే స్పీకర్ దగ్గర ఇష్యూ పెండింగ్ లో ఉన్నట్లు అయిపోయింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు. సమాధానం ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ ను కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు టైమ్ కోరారన్న దానిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ మీద లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన ఔట్ రైట్ గా పార్టీ ఫిరాయించినట్లు బుక్ అయిపోయారన్న అభిప్రాయాలున్నాయి.
ఇక కడియం శ్రీహరి తన కూతురు కాంగ్రెస్ ఎంపీగా నామినేషన్ వేస్తే ఆమెను బలపరుస్తూ సంతకం చేశారు. పైగా కూతురు కోసం ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఇలా ఈ ఇద్దరు ఫిరాయింపుల విషయంలో దొరికిపోయారన్న చర్చ ఎప్పటినుంచో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విషయాలను ప్రస్తావించకుండా కడియం, దానం స్పీకర్ కు వివరణ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆ అంశాలపై వాళ్లు సమాధానం చెప్పుకున్నా దొరికిపోయినట్లే అవుతుంది. అందుకే వాళ్లు కాలయాపనకు మరికొంత టైమ్ అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
జూబ్లీహిల్స్ బైపోల్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కడియం, దానం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే రాజీనామా చేస్తే జూబ్లీహిల్స్ తో పాటు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ వచ్చాక రిజైన్ చేస్తే ఇంకో ఆరు నెలల టైమ్ ఉంటుందని లెక్కలు వేసుకుంటోందట కాంగ్రెస్ పార్టీ. అందుకు ఈ నెలాఖరులో కానీ, అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కానీ దానం, కడియంతో రాజీనామా చేయించి బైఎలక్షన్స్ కు వెళ్లే ప్లాన్ నడుస్తోందట. అందుకే వారు మరికొంత సమయం కావాలంటూ స్పీకర్ ను కోరినట్లు తెలుస్తోంది.
ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణను ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపించారు స్పీకర్. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ వాదన ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారన్నదానిపై స్పీకర్‌కు మరిన్ని ఆధారాలు, సాక్షాలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దమవుతోందట. కేవలం దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రమే కాదు మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే వరకు పోరాటం చేయాలని పట్టుదలతో ఉందట కారు పార్టీ. అవసరమైతే బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ పెట్టి ఈ ఎనిమిది ఎమ్మెల్యేలను సమావేశానికి ఆహ్వానించాలని భావిస్తోందట. వాళ్లు ఎలాగూ ఎల్పీ మీటింగ్ రారు. రాలేరు.. అప్పుడు వారిపై ఫిర్యాదు చేసేందుకు దీనిని కూడా అస్త్రంగా వాడుకోవచ్చన్నది బీఆర్ఎస్ ప్లాన్‌గా తెలుస్తోంది.
అవసరమైతే జంపింగ్ ఎమ్మెల్యేలకు టైమ్ కుదిరినప్పుడే ఎల్పీ మీటింగ్ పెడతామని కూడా వారికి ఆఫర్ ఇచ్చే ప్లాన్ చేస్తోందట. ఎలాగైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరికించి స్పీకర్‌తో వేటు వేయించాలని.. లేకపోతే మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టాలని భావిస్తున్నారట గులాబీ పార్టీ పెద్దలు. అయితే దీనికి చెక్ పెట్టేలా కేవలం మూడు రోజుల గడువు మాత్రమే స్పీకర్ ఇవ్వడంతో మరికొంత సమయాన్ని తాము కూడా కోరాలని ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. ఇలా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తు గేమ్స్ మధ్య జంపింగ్ ఎమ్మెల్యేల ఎపిసోడ్‌కు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.
Also Read: హైదరాబాద్ మెట్రోరైల్ నిర్వహణ మా వల్ల కాదు.. చేతులెత్తేస్తున్న ఎల్ అండ్ టీ!