హైదరాబాద్‌ మెట్రోరైల్‌ నిర్వహణ మా వల్ల కాదు.. చేతులెత్తేస్తున్న ఎల్‌అండ్‌టీ!

నష్టాలు వస్తుండడంపై ఇప్పటికే కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎల్‌అండ్‌టీ లేఖ రాసింది.

హైదరాబాద్‌ మెట్రోరైల్‌ నిర్వహణ మా వల్ల కాదు.. చేతులెత్తేస్తున్న ఎల్‌అండ్‌టీ!

Hyderabad Metro

Updated On : September 12, 2025 / 12:12 PM IST

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోరైల్‌ నిర్వహణ ఆర్థికంగా భారంగా ఉండడంతో దాన్ని కేంద్ర సర్కారు లేదా రాష్ట్ర సర్కారుకు అప్పగించేందుకు నిర్మాణసంస్థ ఎల్‌అండ్‌టీ మొగ్గు చూపుతోంది.

హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించారు. దేశంలో ఈ పద్ధతిలో నిర్మించిన మొదటి మెట్రో ఇదే. (Hyderabad Metro)

నష్టాలు వస్తుండడంతో మెట్రో నిర్వహణ భారంగా మారింది. దీంతో మెట్రో నిర్వహణ కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేసి అప్పగించాలని సర్కారు చెప్పినా తాము అందుకు సిద్ధమని ఎల్‌అండ్‌టీ తెలిపింది. నష్టాలు వస్తుండడంపై ఇప్పటికే కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎల్‌అండ్‌టీ లేఖ రాసింది.

మరోవైపు, మెట్రో రెండో దశ డీపీఆర్‌పై తెలంగాణ సర్కారు నుంచి కేంద్ర సర్కారు వివరణ కోరింది. టికెట్‌ చార్జీల పంపకాలతో పాటు విద్యుత్‌ చార్జీల చెల్లింపులు వంటి వాటిపై ఎల్‌అండ్‌టీతో ఎటువంటి అవగాహన ఉందో తెలపాలని కేంద్ర సర్కారు చెప్పింది. అలాగే, అసంపూర్ణంగా ఉన్న మెట్రో మొదటి దశ ప్రాజెక్టుపై కూడా వివరాలు కోరింది.

హైదరాబాద్‌ మెట్రో రైలు 2017 నుంచి పరుగులు తీస్తోంది. దాదాపు రూ.22 వేల కోట్లతో 69 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మించారు. మొదటి దశకు సంబంధించిన ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా 5.5 కిలోమీటర్ల కారిడార్‌ పెండింగ్‌లో ఉంది.

ఇప్పుడు దీన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించి రెండో దశలో కలిపారు. 2017 నాటికి ఎల్‌అండ్‌టీకి సర్కారు రూ.3,756 కోట్ల రాయితీ బకాయిలను ఇవ్వాల్సి ఉంది. 2020 ఫిబ్రవరి నాటికి అవి రూ.5 వేల కోట్లకు పెరిగాయి.