Gossip Garage: ఇంకో నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయా? రేపే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందా? ఎవరిది పైచేయి అనే రేంజ్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెక్స్ట్ లెవల్ డైలాగ్ వార్..అంతకు మించి సవాళ్ల పర్వం నడుస్తోంది. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత గోదావరిపై ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై డైలాగులు పేలాయి. ఈ క్రమంలో నీటిపారుదల రంగం, రైతు సంక్షేమంపై బీఆర్ఎస్ చెప్తున్నవన్నీ అబద్దాలేనని, దీనిపై కేసీఆర్, కేటీఆర్ లతో చర్చించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
సీఎం రేవంత్ సవాల్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సీయంతో చర్చకు సై అన్న కేటీఆర్..రేవంత్ రెడ్డికి 72 గంటల సమయం ఇచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో 8వ తేదీ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ సవాల్ పై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఉండగా ప్రెస్ క్లబ్ ఎందుకు.. అక్కడికే రండి అని సవాల్ చేశారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. దీంతో రెండు పార్టీల పొలిటికల్ డైలాగ్ వార్ కాక రేపుతోంది.
నిన్న మొన్నటి వరకు ఆరోపణలు, విమర్శలు, మాటల యుధ్దానికే పరిమితమైన కాంగ్రెస్, బీఆర్ఎస్..ఇప్పుడు ఇరిగేషన్, రైతు సంక్షేమంపై చర్చకు రెడీ అంటుండటం రాజకీయ వేడిని రాజేస్తోంది. కేవలం సవాళ్లే కాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఓ అడుగు ముందుకేసి టైం, డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేసింది. ఈ నెల 8న 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని అక్కడ నీటిపారుదల, రైతు సంక్షేమంపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Also Read: వైసీపీ నుంచి వెళ్లిన వాళ్లు మళ్లీ వస్తామంటున్నారా? అసలు వెళ్లింది ఎందుకు, వస్తామంటున్నది ఎందుకు..
ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చిద్దామని చెబుతోంది అధికార కాంగ్రెస్. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు. ఐతే ఈ అంశాలపై చర్చించేందుకు తాము చాలంటున్నారు కేటీఆర్, హరీష్ రావు. అసెంబ్లీ ఎప్పుడు పెడుతారో చెప్పండి..ఏ అంశంపై అయినా చర్చకు రెడీ అంటున్న హరీశ్‌రావు..వన్ కండీషన్ అంటున్నారు. మైక్ కట్ చేయొద్దు..అని షరతు పెడుతున్నారు హరీశ్‌రావు.
మీరు అలిగేషన్స్ చేసి..తాము మాట్లాడుతుంటే మైక్ కట్ చేసి పోతారని..అందుకే మైక్ కట్ చేయమని హామీ ఇచ్చి అసెంబ్లీ పెట్టాలంటూ హరీశ్ సవాల్ చేస్తున్నారు. అయితే ఈ సవాళ్ల వ్యవహారం కేవలం మాటల వరకే పరిమితం అవుతుందే తప్ప కార్యరూపం చాల్చడం కష్టమని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
సవాళ్ల పర్వం కొనసాగుతుండగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇదే సమయంలో 8న ఉదయం 11 గంటలకు చర్చకు రావాలని కేటీఆర్ రేవంత్‌కు సవాల్ చేశారు. కేటీఆర్ సవాల్ నుంచి తప్పించుకునేందుకే రేవంత్ ఢిల్లీ పారిపోయారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో ఎక్కడంటే అక్కడ కాదు అసెంబ్లీలో చర్చిద్దామని చెబుతున్న కాంగ్రెస్..మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రారా, తాము లేవనెత్తే అంశాలపై చర్చించే దమ్ము ఉందా అని ప్రశ్నిస్తుంది.
అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని స్పీకర్‌కు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ లేఖ రాయాలని కాంగ్రెస్ అంటుంటే..సీఎం సభా నాయకుడు..సమావేశాలు ఎప్పుడు పెట్టాలన్నది ఆయన నిర్ణయమని బీఆర్ఎస్ రివర్స్ అటాక్ చేస్తోంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఇలా సవాళ్లు చేసుకోవడం వరకే పరిమితం అవుతాయా? లేక చర్చ వరకు వెళ్తారా అన్నది ఆసక్తి రేపుతోంది.