సీఎం రేవంత్‌ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ భారీ వ్యూహం..!

ఒకట్రెండు రోజుల్లో పూర్తి కార్యచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. అక్కడి నుంచి కేటీఆర్ పాదయాత్ర మొదలుపెడితే.. తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Gossip Garage Ktr Padayatra (Photo Credit : Google)

Gossip Garage : కేటీఆర్‌ పాదయాత్ర.. ఎలా మొదలుపెట్టాలి.. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అనే ప్రశ్నకు ఎట్టకేలకు ఆన్సర్ దొరికిందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ముందు హైడ్రా అనుకున్నారు.. తర్వాత మూసీ అంశం దొరికింది.. ఇక ఇప్పుడు అనుకోకుండా లగచర్ల అందివచ్చింది. లగచర్ల దాడి ఘటన సంగతి ఎలా ఉన్నా.. అక్కడ ఫార్మా క్లస్టర్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతుల పక్షాన పోరాటం చేయాలని భావిస్తోందట బీఆర్ఎస్. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్న కేటీఆర్‌.. సీఎం రేవంత్ సొంత ఇలాకా కొడంగల్ నుంచి రైతు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారా.. అక్కడి నుంచే తన పాదయాత్ర మొదలుపెట్టాలన్న ఆలోచన వెనక స్ట్రాటజీ ఏంటి?

డిసెంబర్‌ 7 తర్వాత రంగంలోకి కేసీఆర్‌..
కాంగ్రెస్ సర్కార్‌ మీద అంశాలవారీగా పోరాటం చేస్తూ.. బీఆర్ఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల నుంచి మొదలు.. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన అంశాల వరకు.. అన్ని విషయాల్లోనూ రేవంత్ సర్కార్‌ను గులాబీ నేతలు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి డిసెంబర్ 7తో ఏడాది పూర్తి కాబోతోంది. ఆ తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగుతారని… రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఇప్పటికే కేసీఆర్‌ ప్రణాళికలు కూడా సిద్ధం అయ్యాయనే ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్‌ ఈజ్‌ బ్యాక్ అనే మూమెంట్‌ కోసం.. బీఆర్ఎస్ శ్రేణులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య లగచర్ల ఇష్యూ.. బీఆర్ఎస్‌కు రాజకీయంగా అంది వచ్చినట్లు అయిందనే టాక్ నడుస్తోంది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో.. కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటన.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను రాజకీయంగా ఎలా యూజ్‌ చేసుకోవాలన్న దానిపై బీఆర్ఎస్ సీరియస్‌గా దృష్టి సారించినట్లు సమాచారం.

ఉద్యమాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం యూజ్‌ చేసే ప్లాన్‌..
సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో.. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో భాగంగా ఫార్మా క్లస్టర్‌ను నెలకొల్పేందుకు.. కొంత కాలంగా భూసేకరణ జరుగుతోంది. ఐతే స్వయంగా సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో… పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని… జనాల నుంచి వ్యతిరేకత రాకపోవచ్చని బీఆర్ఎస్ నేతలు భావించారట. ఐతే లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులపై స్థానిక రైతులు దాడికి దిగారు.

దీంతో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయింది. లగచర్ల దాడి ఘటనను రేవంత్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంటుంటే.. బీఆర్ఎస్ మాత్రం అక్కడి ఉద్యమాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తుందనే చర్చ జరుగుతోంది. కొడంగల్ నియోజకర్గంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా క్లస్టర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని గులాబీ పార్టీ ఆలోచన చేస్తోందని తెలుస్తోంది.

కొడంగల్ నుంచే స్టార్ట్‌ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన..
లగచర్ల దాడి ఘటనపై.. ప్రస్తుతం అత్యున్నత పోలీసు విచారణ కొనసాగుతోంది. దాడి ఘటనలో బీఆర్ఎస్ నేతల కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్‌ సర్కార్‌. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. త్వరలోనే కేటీఆర్ వంతు అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలోనే తెలివిగా ఆలోచించి లగచర్ల అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర మొదలుపెట్టాలని భావిస్తున్న కేటీఆర్‌.. అదేదో సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా కొడంగల్ నుంచే మొదలుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట.

ఫార్మా క్లస్టర్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న గ్రామాల రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తే… ఎలా ఉంటుందన్న దిశగా కేటీఆర్ సమాచాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. పాదయాత్ర ద్వారా అటు రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడంతో పాటు… అటు కొడంగల్ రైతులకు అండగా నిలిస్తే పొలిటికల్‌గా మైలేజ్ వస్తుందనే చర్చ.. తెలంగాణభవన్‌లో జోరుగా సాగుతోంది.

తనను ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ భావన..
ఈ-కార్ రేస్ నుంచి ఇప్పుడు లగచర్ల వరకు.. ఏదో ఒక కేసులో తనను ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ భావిస్తున్నారు. ఐతే లగచర్ల ఘటనలో తనను అరెస్ట్ చేస్తే.. అది తనకు, పార్టీకి అడ్వాంటేజ్‌ అవుతుందనే భావనలో ఆయన ఉన్నారు. అదేదో కొడంగల్ పాదయాత్రలోనే జరిగితే.. రాజకీయంగా కలిసి రావడంతో పాటు.. జనంలో సింపథీ ఫ్యాక్టర్‌ వర్కౌట్ అవుతుందన్నది కేటీఆర్ ఆలోచనగా కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. కొడంగల్‌ నుంచి పాదయాత్ర వ్యవహారంపై.. ఇప్పటికే ఒకరిద్దరు నేతలతో కేటీఆర్ చర్చించారట. ఒకట్రెండు రోజుల్లో పూర్తి కార్యచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. కొడంగల్‌ నుంచి కేటీఆర్ పాదయాత్ర మొదలుపెడితే.. తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

 

Also Read : ఎమ్మెల్సీ సీటు.. ఎవరికి లక్కీ చాన్స్? బీఆర్ఎస్‌లో గట్టి పోటీ..