×
Ad

Patancheru Politics: పురపోరు వేళ కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న వర్గపోరు.. పటాన్‌చెరులో ఆ ముగ్గురిని సమన్వయం చేసేదెట్లా?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి..హస్తం పార్టీలో అంత కంఫర్ట్ గా లేరన్న టాక్ నడుస్తోంది. గూడెం రాకను కాట శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇక గూడెంకు, నీలం మధుకు బీఆర్ఎస్ లోనే పడేది కాదు.

Patancheru Congress Politics Representative Image (Image Credit To Original Source)

  • మున్సిపల్ ఎన్నికల వేళ.. ఆధిపత్య పోరు టెన్షన్
  • కాంగ్రెస్ పెద్దలను పరేషాన్ చేస్తున్న కుమ్ములాటలు
  • పటాన్ చెరులో ఆ ముగ్గురు నేతల సమన్వయం అయ్యే పనేనా?

Patancheru Politics: మున్సిపల్ సమరానికి సర్వం సిద్ధమైంది. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం మూడు ముక్కలాట నడుస్తోంది. ఇప్పుడిదే అధికార పార్టీలో టెన్షన్ పెడుతోందట. హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న ఆ నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో గెలిచేందుకు ఈ ముగ్గురిని ఎలా సమన్వయం చేయాలో అధికార పార్టీ పెద్దలకు అంతుచిక్కడం లేదట. ఆ ముగ్గురు ఒక్కటైతే గానీ ఐదు సీట్లు గెలువలేము. మరి ఆ ఐదింటిలో పాగా వేసేదెట్లా అంటూ కాంగ్రెస్‌ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. హస్తం పార్టీ లీడర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఆ నియోజకవర్గం ఏంటి? అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది?

పటాన్చెరు కాంగ్రెస్ లో కుమ్ములాట.. హస్తం పార్టీ పెద్దలకు హెడెక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ ముగ్గురు కీలక నేతలది..ఎవరి దారి వారిదే… ఒకరంటే ఒకరికి గిట్టదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ..వాళ్లను సమన్వయం చేయడంపై ఫోకస్ పెట్టారట కాంగ్రెస్ పెద్దలు. బీఆర్ఎస్ నుంచి పటాన్ చెరు ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికలప్పుడు హస్తం గూటికి చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిన నీలం మధు ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్నారు. ఈ ముగ్గురు నేతలు కూడా ఎవరికి వారే మున్సిపల్ ఎన్నికల్లో తమ అనుచరులను బరిలోకి దింపేందుకు ఇప్పటినుండే స్కెచ్లు వేస్తున్నారట.

టికెట్ ఇస్తే సరి లేదంటే అంటూ.. సొంత పార్టీకే సవాళ్లు

కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తే సరి… లేదంటే ఇండిపెండెంట్ గా తమ అనుచరులను దింపైనా గెలిపించుకుంటామంటూ సొంత పార్టీకే సవాళ్లు విసురుతున్నారట. పటాన్ చెరు అత్యంత కీలకమైన ప్రాంతం కావడం..ముగ్గురు నేతలు పట్టున్న లీడర్లు కావడంతో ఎలా డీల్ చేస్తే..వర్గపోరుకు చెక్ పెట్టొచ్చన్నది కాంగ్రెస్ పెద్దలకు ఇప్పుడు సవాల్ గా మారిందనే టాక్ నడుస్తోంది. పటాన్ చెరు నియోజకవర్గంలో ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ఐదు పురపాలక సంఘాలు కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉండటం.. ఫైనాన్షియల్ గా కీలకమైన ప్రాంతాలు కావడంతో ఈ ఐదింటిపై జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి..హస్తం పార్టీలో అంత కంఫర్ట్ గా లేరన్న టాక్ నడుస్తోంది. గూడెం రాకను కాట శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇక గూడెంకు, నీలం మధుకు బీఆర్ఎస్ లోనే పడేది కాదు. గూడెంకు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించే నీలం మధు కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. ఇలా ఓవైపు నీలం మధు.. మరోవైపు కాట శ్రీనివాస్ గౌడ్లతో ఎమ్మెల్యే గూడెంకు కాంగ్రెస్ లో మద్దెల దరువు తప్పడం లేదట. దీంతో గూడెం కూడా మనిషిక్కడ, మనసక్కడ అన్నట్లు హస్తం పార్టీలో అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు.

విడివిడిగా పోటీ చేస్తే.. సర్పంచ్ ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందన్న ఆందోళన..

ఇక మహిపాల్ రెడ్డి సొంత సోదరుడు గూడెం మధు ఈ నెల 17న తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు. మహిపాల్ రెడ్డితో పాటు గూడెంతో కాంగ్రెస్ లోకి వచ్చిన క్యాడర్ అంతా కారు ఎక్కేందుక రెడీ అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఇక వచ్చే జనరల్ ఎలక్షన్ నాటికి మహిపాల్ రెడ్డి కూడా మళ్లీ గులాబీ గూటికి చేరతారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీంతో పటాన్ చెరులో కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు వర్గాలే కీలకంగా ఉండనున్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలను ఏకతాటిపై నిలిస్తే.. ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ఈజీ అని భావిస్తున్నారట కాంగ్రెస్ లీడర్లు. ఈ ఇద్దరు నేతలు క్యాడర్ రెండుగా చీలిపోయి విడివిడిగా పోటీ చేస్తే..సర్పంచ్ ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని ఆందోళన చెందుతున్నారట.

పటాన్ చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మధ్యే మార్గంగా ఒక ప్లాన్ చేస్తుందట. మున్సిపల్ ఎన్నికల్లో సర్వే ఆధారంగా గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు మున్సిపాలిటీలలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నీలం మధుకు ఈ 5 మున్సిపాలిటీల్లోనూ మెజారిటీ రావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాట శ్రీనివాస్ గౌడ్ కూడా గట్టి పోటీ ఇచ్చి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. దీంతో ఇద్దరు కీలక నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఓ ఫార్ములాను పరిశీలిస్తున్నారట.

మున్సిపాలిటీల వారీగా ఇస్నాపూర్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో మొత్తం 100 డివిజన్లు ఉన్నాయి. అటు కాట శ్రీనివాస్ గౌడ్, ఇటు నీలం మధు ఇద్దరికి చెరో 50 డివిజన్ల చొప్పున పంచాలనే ఆలోచన చేస్తున్నారట. ఏ డివిజన్ లో ఎవరికి బలం ఉంటే వారికే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారట. ఇలా చేస్తే ఐదు మున్సిపాలిటీలను ఈజీగా గెలవొచ్చనేది కాంగ్రెస్ పెద్దల ప్లాన్ అంటున్నారు. ఇదే జరిగితే గూడెం మహిపాల్ రెడ్డి ఏం చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా పటాన్ చెరు పంచాయితీకి చెక్ పెట్టి..పుర పోరులో గట్టెక్కడం మాత్రం హస్తం పార్టీకి తలకు మించిన భారంగా మారింది. దీని నుండి అధికార పార్టీ ఎలా బయట పడుతుందో చూడాలి.

Also Read: ఖైరతాబాద్ ఉపఎన్నికకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్.. గెలిచేందుకు ఖతర్నాక్ ప్లాన్..!