Kavitha: కన్ఫ్యూజన్స్ వీడుతున్నాయ్. పొలిటికల్ ఫ్యూచర్‌పై అక్క ఓ క్లారిటీకి వచ్చినట్లే కనిపిస్తుంది. కారు పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత..సొంతంగా పాలిటిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నారట. రాజకీయ పార్టీ ప్రకటించేందుకు కూడా టైమ్, డేట్‌తో పాటు మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. ఈ దసరా పండగకే కవిత తన పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేయబోతున్నారని టాక్. అదే రోజు గాంధీ జయంతి కూడా కావడంతో ఇంతకన్నా మంచి ముహూర్తం ఏముందనే టాక్ జాగృతి కార్యకర్తల్లో నడుస్తోంది. కొత్త పార్టీ పెట్టడమే కాదు..జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో అభ్యర్ధిని కూడా పోటీకి దింపబోతున్నారట కవితక్క.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్ యాక్టివిటీని స్పీడప్ చేస్తున్నారు. తండ్రి కేసీఆర్ సొంతూరు చింతమడకలో పర్యటించి మాజీ మంత్రి హరీశ్ టార్గెట్ గా విమర్శలు చేసిన కవిత..సిద్దిపేట తన కర్మభూమి కావొచ్చంటూ హింట్ ఇచ్చారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో సింగరేణి కార్మికులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కవిత.. గజ్వేల్ నియోజకవర్గంలోనూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు పెడుతూ ఏదో యాక్టివిటీతో లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తున్న కవిత..కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారట. కాంగ్రెస్, బీజేపీలో చేరే ప్రసక్తే లేదంటున్న కవిత..తన ముందు ఉన్న ఆప్షన్ కొత్త రాజకీయ పార్టీ మాత్రమేనన్న అభిప్రాయానికి వచ్చారట.
వందల మందితో పార్టీ ఏర్పాటుపై డిస్కస్ చేశారట కవిత. కుటుంబ సభ్యులు మొదలు సన్నిహితులు, మేధావులు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్లు, న్యాయవాదులు, పలు రంగాల ప్రముఖుల అభిప్రాయాలు తీసుకున్నారట. తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీకి స్పేస్ ఉందా.? పార్టీ పెడితే ఎలా ముందుకు వెళ్లాలి.? ఇతర పార్టీల్లోంచి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది.? పార్టీ నిర్మాణం ఎలా ఉండాలనే అంశాలపై చాలామందితో చర్చించారట కవిత.
తెలంగాణ, ఏపీతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో గతంలో ఎవరెవరు పార్టీలు పెట్టారు.? అందులో ఎవరు సక్సెస్ అయ్యారు.? ఎవరు ఫెయిల్ అయ్యారు.? వాళ్ల సక్సెస్ కు, ఫెయిల్యూర్ కు కారణాలేంటనే దానిపై ఆరా తీస్తున్న కవిత.. తన రాజకీయ పార్టీని తెలంగాణలో విజయవంతంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదానిపై రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారని సమాచారం.
పార్టీ పేరుపై కూడా పలువురు మేధావులతో కవిత చర్చలు జరిపినట్లు జాగృతి వర్గాలు చెబుతున్నాయి. తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన..తన సొంత సంస్థ అయిన తెలంగాణ జాగృతి పేరుతో పాటు సామాజిక తెలంగాణ పార్టీ, బహుజన తెలంగాణ పార్టీ వంటి పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే తనకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన తెలంగాణ జాగృతి వైపే కవిత మొగ్గుచూపినట్లు టాక్ వినిపిస్తోంది.
చర్చోపచర్చల తర్వాత తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి తెలంగాణ జాగృతి పార్టీ అని నామకరణం చేయాలని కవిత డిసైడ్ అయినట్లు సమాచారం. తెలంగాణ జాగృతి పేరుతో అయితేనే ప్రజల్లోకి తొందరగా వెళ్లగలమని, అలా అయితే ప్రత్యేకంగా తన పార్టీ పేరును ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని కవిత భావిస్తున్నారట.
రానున్న ఎన్నికల్లో సిద్ధిపేట నుండి బరిలోకి కవిత?
ఇక తన పార్టీ ప్రకటనకు కూడా కవిత ముహూర్తం ఖరారు చేసుకున్నారని అంటున్నారు. ఈ దసరా పండగ రోజు విజయదశమి సందర్భంగా తెలంగాణ జాగృతి పార్టీని కవిత అధికారికంగా ప్రకటించబోతున్నారట. పార్టీ పెట్టడంతో పాటు వెంటనే రంగంలోకి దిగాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలోకి తొలిసారిగా అభ్యర్థిని బరిలో దింపాలని… తాను రానున్న ఎన్నికల్లో సిద్దిపేట నుండి బరిలో దిగాలని కవిత ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని జాగృతి వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ కవితను కలిశారని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆయననే బరిలోకి దింపే అవకాశాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ నుంచే తన పొలిటికల్ యాక్టివిటీని స్పీడప్ చేయాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిరాడంబరంగా పార్టీ ప్రకటన చేసి.. ఆ తర్వాత జూబ్లీహిల్స్ లో భారీ ఎన్నికల సభతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్లాన్ లో కవిత ఉన్నారని తెలుస్తోంది.