Congress Four Mlas: కాంగ్రెస్ కంట్లో నలుసులా ఆ నలుగురు..! హస్తం పార్టీలో కాక రేపుతున్న ఎమ్మెల్యేలు ఎవరు? వారి ఎజెండా ఏంటి?

ఈ నలుగురి తీరు కంట్లో నలుసులా మారడంతో పార్టీ ముఖ్యనేతలు కూడా ఓ కన్నేసి ఉంచారట. వీరి విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై..

Congress Four Mlas: కాంగ్రెస్ కంట్లో నలుసులా ఆ నలుగురు..! హస్తం పార్టీలో కాక రేపుతున్న ఎమ్మెల్యేలు ఎవరు? వారి ఎజెండా ఏంటి?

Updated On : September 24, 2025 / 9:02 PM IST

Congress Four Mlas: ఇంటర్నల్ డెమోక్రసీ. ఈ పదం వింటేనే కాంగ్రెస్ గుర్తుకొస్తుంది. అధికారంలో ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా..కాంగ్రెస్‌ లీడర్ల ఫైటింగే వేరు. ఇప్పుడు తెలంగాణలో పవర్‌లో ఉన్న కాంగ్రెస్‌కు ఆ నలుగురు ఎమ్మెల్యేల తీరు కంట్లో నలుసులా మారిందట. వాళ్లిస్తున్న స్టేట్‌మెంట్లు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. ఓపెన్ స్టేట్‌మెంట్లు..వారు వేస్తున్న అడుగులు హస్తం పార్టీలో కాక రేపుతున్నాయట. ఇంతకు ఎవరా నలుగురు ఎమ్మెల్యేలు.? వాళ్ల తీరు ఎందుకలా.? ఆ ఎమ్మెల్యేల ఎజెండా ఏంటి.? వారి విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏంటి.?

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌కు ప్రతిపక్ష పార్టీల కంటే..సొంత పార్టీ నేతల తీరే ఎక్కువ ఇబ్బందికరంగా మారుతోందట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే..నలుగురు ఎమ్మెల్యేల తీరు అయితే సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉందట. వాళ్లు తమ అభిప్రాయాలను ఓపెన్‌ డయాస్‌ల మీదే చెప్పేస్తూ..ప్రభుత్వాన్ని, పార్టీని ఇరకాటంలో పెట్టేస్తున్నారట. ఆ నలుగురి విషయంలో ఏం చేద్దాం..ఎలా అయితే వాళ్లు నోళ్లు మూత పడతాయనేదానిపై తర్జనభర్జన పడుతున్నారట ప్రభుత్వ పెద్దలు.

ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకున పెట్టేలా ఆ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..

కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్‌ హాట్‌గా టాపిక్‌గా మారారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకిచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వలేదని..సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ ఒకవైపు ప్రభుత్వాన్ని..మరోవైపు పార్టీని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను రాజగోపాల్‌రెడ్డి తప్పుపట్టారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒక్కోసారి ఒక్కో అంశాన్ని లేవనెత్తుతున్నారు.

లేటెస్ట్‌గా ట్రిపుల్‌ ఆర్‌ ప్రాజెక్ట్ విషయంలో కూడా రాజగోపాల్‌రెడ్డి కామెంట్స్‌ హాట్ టాపిక్ అయ్యాయి. రైతులకు న్యాయం జరిగే కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తానని..అలైన్ మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అంటూ పెద్ద బాంబే పేల్చారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం కూడా గమనిస్తోంది. క్రమశిక్షణ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతోంది.

కలకలం రేపిన ఎమ్మెల్యే రహస్య సమావేశం..

ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల తీరు ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి చిక్కులు తెస్తుందట. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిల తీరు సర్కార్ కు హెడేక్‌గా మారుతోందట. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన రహస్య సమావేశం పొలిటికల్ సర్కిల్స్‌ హాట్ డిబేట్‌గా మారింది. ఈ అంశం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. తర్వాత ఓ రియల్ ఎస్టేట్‌ కంపెనీకి అనుమతులపైనా అనిరుధ్‌రెడ్డి సీఎం రేవంత్‌ను ఇరకాటంలో పెట్టేలా కామెంట్స్ చేశారు.

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఈ మధ్య ఒక పత్రికలో రాసిన వ్యాసం కూడా చర్చకు దారి తీసింది. ఏదైనా చెప్పదలుచుకుంటే స్వయంగా తనకొచ్చి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పలు మార్లు చెబుతున్నా.. నేతలు మాత్రం తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి రాసిన పత్రికా వ్యాసాన్ని..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్ చేస్తూ.. యెన్నం అభిప్రాయాలను తాను స్వాగతిస్తున్నానని పోస్ట్ చేశారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన ట్వీట్‌ను..ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి రీట్వీట్ చేస్తూ స్వాగతించారు. ఈ వ్యవహారం కూడా కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది.

ఇక మరో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటు. పైకి ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా..ఆయన చర్యలే పొలిటికల్ సర్కిల్స్‌లో సరికొత్త చర్చకు దారి తీస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం కోసం..స్వయంగా జిల్లాకు వస్తే నర్సంపేట శాసనసభ సభ్యుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. అందుబాటులో లేక హాజరుకాకపోతే పెద్దగా చర్చ ఉండేది కాదు. కానీ ఆయన తన నియోజకవర్గంలో ఉండి కూడా సీఎం సమావేశానికి డుమ్మా కొట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రెండేళ్లలో ఏ ఒక్క సందర్భంలో కూడా ఆయన సీఎంతో వేదిక పంచుకోలేదట. నిన్నటికి నిన్న సీఎం మేడారంలో పర్యటిస్తూ కూడా దొంతి మాధవరెడ్డి ముఖ్యమంత్రి పర్యటన వైపు కన్నెత్తి చూడలేదు.

ఇలా నలుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరు..హస్తంలో ఆసక్తికరంగా మారిందట. ఈ నలుగురి తీరు కంట్లో నలుసులా మారడంతో పార్టీ ముఖ్యనేతలు కూడా ఓ కన్నేసి ఉంచారట. వీరి విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారట.

Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రంగంలోకి గులాబీ బాస్ కేసీఆర్..! బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?