KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రంగంలోకి గులాబీ బాస్ కేసీఆర్..! బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?
ఈ నియోజకవర్గంలో దాదాపు లక్షా 20 వేల ముస్లిం మైనారిటీ ఓట్లు ఉండగా ఆయా వర్గాలతోనూ కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అవుతూ..వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

KCR: సార్ సైలెంట్‌గా ఉన్నారు. వ్యూహాత్మక మౌనం పాటిస్తూ.. ఫాంహౌస్‌లోనే మీటింగ్‌లు పెడుతూ వస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్‌పై అయితే పెద్ద కసరత్తే చేస్తున్నారట. ఇప్పటికే అభ్యర్థిని డిసైడ్ చేసిన కారు పార్టీ..ప్రచార వ్యూహాలపై స్పెషల్ కాన్సంట్రేషన్ పెడుతోంది. ఎలాగైనా సిట్టింగ్ సీటును గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది గులాబీ పార్టీ. ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకోగానే దళపతి కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారట. క్యాంపెయిన్‌లో భాగంగా జరిగే ఓ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుందట బీఆర్ఎస్.
తెలంగాణలో బలంగానే ఉన్నామన్న సంకేతాలు పంపాలనే పట్టుదల..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుంటుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని తిరిగి సాధించేందుకు గులాబీ పార్టీ సీరియస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందింది. దీంతో గ్రేటర్‌లో రెండో సీటుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది. ఎలాగైనా సిట్టింగ్ సీటును గెలిచి..అధికార కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది గులాబీ పార్టీ. జూబ్లీహిల్స్ బైఎలక్షన్స్‌లో గెలిచి తెలంగాణలో తాము బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలని గులాబీ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగా ఉపఎన్నికపై బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది.
ఆ ఎన్నికలపై ఎఫెక్ట్ పడొద్దన్నా, క్యాడర్‌లో జోష్ పెరగాలన్నా గెలుపు మస్ట్..!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ పోల్స్ వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు జంపింగ్ ఎమ్మెల్యేల్లో పదికి పది కాకపోయినా కనీసం నాలుగు సీట్లకైనా ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటుందట. ఆ ఎన్నికలపై ఎఫెక్ట్ పడొద్దన్నా, క్యాడర్‌లో జోష్ పెరగాలన్న జూబ్లీహిల్స్‌లో గెలవడం తప్పనిసరని భావిస్తోందట కారు పార్టీ. అంతే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత ఉందని చెబుతూ వస్తున్న బీఆర్ఎస్..ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచి ప్రజా వ్యతిరేకత ఉందని ప్రూవ్ చేయాలని భావిస్తోందట.
ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. ఎప్పటి నుంచో జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఆరు డివిజన్లు ఉండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డివిజన్ల వారిగా సమావేశాలు పెడుతున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు లక్షా 20 వేల ముస్లిం మైనారిటీ ఓట్లు ఉండగా ఆయా వర్గాలతోనూ కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అవుతూ..వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగనున్నారని తెలంగాణ భవన్ వర్గాల టాక్. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో స్వయంగా కేసీఆర్ పాల్గొంటారని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారిగా మొత్తం ఆరు బహిరంగ సభలు పెట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో లాస్ట్ డే రోజు నిర్వహించే బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసెడెంట్ కేటీఆర్‌తో కేసీఆర్ చర్చించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే కేసీఆర్ హాజరయ్యే ప్రచార సభ ఎక్కడ పెట్టాలన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇలా చాలాకాలం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారన్న టాక్ బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్సాహం నింపుతోంటే.. రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలోని పలు అంశాలు, రాజకీయాలపై ఏం మాట్లాడతారు.. ఏయే విషయాలను ప్రస్తావిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.