కేసీఆర్‍ను అవమానించాలనే అలా చేశారా? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రొటోకాల్ గొడవ.. అసలేం జరిగిందంటే..

మాజీ సీఎం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి మంత్రులతో సమానంగా హోదా కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయని అంతా గుర్తు చేశారు.

Gossip Garage : ప్రభుత్వ సలహాదారు పోస్టు పెద్దదా? ప్రతిపక్ష నేత హోదా పెద్దదా..? రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి కన్నా, ప్రభుత్వ సలహాదారు పదవే ఉన్నతమైనదా? ప్రతిపక్ష నేతకు ఎలాంటి గౌరవం ఇవ్వరా? ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రజలు ఎన్నుకున్న నేతలకు… ప్రభుత్వం నియమించిన ప్రతినిధులకు మధ్య ఎలాంటి ప్రొటోకల్‌ పాటించాలి? ఎవరి హోదాకు ఎలాంటి గౌరవం ఇవ్వాలి? ఇప్పుడిదే తెలంగాణలో హాట్‌టాపిక్‌. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నుంచి మొదలైన ప్రొటోకాల్‌ రచ్చ కొనసాగుతూనే ఉంది…. ఇప్పుడు ఏకంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కే ప్రొటోకాల్‌ సమస్య ఎదురైంది…. దీంతో రాష్ట్రంలో ప్రొటోకాల్‌పై చర్చ జరుగుతోంది. అసలు ఏంటీ ప్రొటోకాల్‌ గొడవ..? ఎందుకీ రచ్చ?

రాష్ట్ర మంత్రులనూ అవమానించారని ఆరోపణలు..
స్వాతంత్ర సంబరాల్లో ప్రొటోకాల్‌ రచ్చ… అధికార, ప్రతిపక్షాల మధ్య రగడకు దారితీసింది. మాజీ సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌లో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై బీఆర్‌ఎస్‌ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేల విషయంలో ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఆరోపిస్తున్న ఆ పార్టీకి… ఇప్పుడు అధినేతకే అలాంటి అనుభవం ఎదురవడంతో షాక్‌కు గురైంది. వెంటనే అధికారుల తప్పులపై బీఆర్‌ఎస్‌ ఫైర్‌ అవడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. కానీ, అధికారుల అత్యుత్సాహంతో ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు ప్రాధాన్యం తగ్గించేలా వ్యవహరించినా, అదే సమయంలో రాష్ట్ర మంత్రులనూ అవమానించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సాధారణ ఎమ్మెల్యేల వరుసలో కేసీఆర్ పేరు..
మెదక్‌లో స్వాతంత్ర వేడుకలకు సంబంధించి తొలుత ఓ ఆహ్వాన పత్రికను ముద్రించారు అధికారులు. ఇందులో మాజీ సీఎం కేసీఆర్‌కు హోదాకు తగిన ప్రాధాన్యం దక్కలేదని విమర్శలు గుప్పుమన్నాయి. స్వాతంత్ర్య సంబరాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు కే కేశవరావును ఆహ్వానించారు. ఇక విశిష్ట అతిథులుగా మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహను పిలిచారు. ఐతే ప్రతిపక్ష నేత, క్యాబినెట్‌ ర్యాంకుకు సమాన హోదా ఉన్న కేసీఆర్‌ పేరును ఆహ్వాన పత్రికల్లో సాధారణ ఎమ్మెల్యేల వరుసలో చేర్చడమే రగడకు కారణమైంది.

ప్రభుత్వ సలహాదారుకన్నా ప్రధాన ప్రతిపక్ష నేత హోదానే పెద్దదని ట్రోల్..
కేసీఆర్‌ పేరును శాసనసభ్యుల మధ్య ముద్రించడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ సలహాదారుకన్నా ప్రధాన ప్రతిపక్ష నేత హోదానే పెద్దదని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ట్రోల్‌ చేశారు. పైగా మాజీ సీఎం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి మంత్రులతో సమానంగా హోదా కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయని అంతా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రొటోకాల్‌ నిబంధనలను పరిశీలించాలని సూచించడంతో అధికారులు తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.

విమర్శలు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు..
కేసీఆర్‌కు గౌరవం దక్కకపోవడంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకున్నది. ఆహ్వాన పత్రికల్లో మార్పులు చేసింది. కేసీఆర్‌ పేరును విశిష్ట అతిథుల జాబితాలో చేర్చింది. ముఖ్య అతిథిగా కేకేను పేర్కొంటూ.. ఆ తర్వాతి స్థానంలో కేసీఆర్‌ పేరును మార్చింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకులు అనే హోదాను చేర్చింది. అయితే, ముందుగా బయటకు వచ్చిన ఆహ్వాన పత్రిక అసలుది కాదని జిల్లా అధికారులు సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో మొదట వచ్చింది అసలుది కాకపోతే.. డిజైన్‌, అక్షరాలు, రంగులు, పేర్లు, పరిమాణం అచ్చు గుద్దినట్టు ఎలా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి నవ్వులపాలు కావొద్దని సూచిస్తున్నారు.

ఇదే సమయంలో మంత్రులు ఉండగా, ప్రభుత్వ సలహాదారుతో జెండా వందనం చేయించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్‌లో జెండా వందనంకి వచ్చిన కే.కేశవరావకు జిల్లాకు ఏంటి సంబంధమని బీఆర్‌ఎస్‌ నిలదీస్తోంది. కేవలం కేసీఆర్‌ను అవమానించాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీ నుంచి వచ్చిన నేతను కాంగ్రెస్‌లో చేర్చుకుని… జెండా వందనంకి ముఖ్య అతిథిగా పిలిచారా? అని ప్రశ్నిస్తోంది. మొత్తానికి స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగడం రాజకీయంగా హీట్‌ పుట్టించింది.

Also Read : ఆపరేషన్‌ బాలి..! కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు విరుగుడుగా బీఆర్‌ఎస్‌ స్పెషల్‌ ఆపరేషన్‌..!

ట్రెండింగ్ వార్తలు