ఆపరేషన్‌ బాలి..! కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు విరుగుడుగా బీఆర్‌ఎస్‌ స్పెషల్‌ ఆపరేషన్‌..!

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 16 మందిని ఎలాగైనా లాగేసి విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తోంది.

ఆపరేషన్‌ బాలి..! కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు విరుగుడుగా బీఆర్‌ఎస్‌ స్పెషల్‌ ఆపరేషన్‌..!

Gossip Garage : ఆపరేషన్‌ బాలి…. కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు విరుగుడుగా బీఆర్‌ఎస్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ స్టార్ట్‌ చేసిందట…. కాంగ్రెస్‌ వలకు చిక్కకుండా గులాబీదళాన్ని కాపాడుకోవడమే ఈ ఆపరేషన్‌ అంటున్నారు. బీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌ రావు ఆధ్వర్యంలో ఇండోనేషియా రాజధాని బాలిలో ఈ స్పెషల్‌ ఆపరేషన్‌ జరుగుతోందట… దీంతో బాలిలో ఏం జరుగుతోందనేది ఇప్పుడు తెలంగాణలో ఇంట్రస్టింగ్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ బీఆర్‌ఎస్‌ రాజకీయం బాలికి ఎందుకు మారింది? విదేశాల్లో కారు పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు…?

ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి బీఆర్‌ఎస్‌ ఎత్తుగడలు..
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్‌, విపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య టామ్‌ అండ్‌ జెర్రీ పోరాటం హోరాహోరీగా కొనసాగుతోంది. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఆపరేషన్‌ ఆకర్ష్‌ 2.O ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుండగా, సీఎం వలకు ఎవరూ చిక్కకుండా… ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి బీఆర్‌ఎస్‌ ఎత్తుగడలు వేస్తోంది. ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కుమారుడి వివాహానికి దాదాపు ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం అందింది. ఈ వివాహం కోసం బాలి వెళ్లిన బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులతో ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌ రావు కూడా జాయిన్‌ అయ్యారు.

రెండో విడత ఆకర్ష్‌కు సీఎం రేవంత్ తెర తీయనున్నట్లు ప్రచారం..
బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ఏకైక టార్గెట్‌తో ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టిన కాంగ్రెస్‌… ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ కండువాలు కప్పింది. ఇంకా 16 మంది ఎమ్మెల్యేలను హస్తం గూటికి రప్పించేందుకు సామ దాన బేధ దండోపాలయాలను ప్రయోగిస్తోంది. ఐతే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌పై విముఖత వ్యక్తం చేయడంతో కొద్దిరోజులుగా బ్రేక్‌ పడింది. ఇక సీఎం విదేశీ పర్యటన నుంచి తిరిగి రావడంతో రెండో విడత ఆకర్ష్‌కు తెర తీయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ట్రబుల్‌ షూటర్‌ కి ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకునే బాధ్యత..
దీంతో సీఎం వ్యూహాన్ని పసిగట్టిన బీఆర్‌ఎస్‌…. ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకునే బాధ్యతను ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌ రావుకు అప్పగించిందని చెబుతున్నారు. అందుకే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కుమారుడి వివాహానికి ఎమ్మెల్యేలతోపాటుగా బాలి వెళ్లిన హరీశ్‌ రావు… పార్టీ నుండి ఎవరూ చేజారకుండా అక్కడే వ్యూహరచన మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపై ఒక్క ఎమ్మెల్యే కూడా కారు దిగకుండా పకడ్బందీగా స్కెచ్‌ వేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌ ప్రలోభాలకు ఎవరూ తలొగ్గొద్దని… భవిష్యత్‌ మళ్లీ బీఆర్‌ఎస్‌దేనని ఎమ్మెల్యేలకు భరోసా ఇస్తున్న హరీశ్‌ రావు… పార్టీని వీడనున్నారని అనుమానం ఉన్న వారితో బాలిలోనే ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హరీశ్‌ రావు భరోసాతో అటూ ఇటుగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం కారులోనే కొనసాగతామని చెప్పినట్లు తెలుస్తోంది.

పార్టీ మారి తప్పు చేయొద్దని హితవు..
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కుమారుడి వివాహం కోసం హరీశ్‌రావుతో పాటు మెజారిటీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చించిన హరీశ్‌ రావు కాంగ్రెస్‌ ఎన్నికల హామీలు అమలు చేయలేదని…. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతతో కనిపిస్తున్నందున పార్టీ మారి తప్పు చేయొద్దని ఎమ్మెల్యేలకు నచ్చజెబుతున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ కు విధేయంగా సుమారు 15 మంది..!
ఇక మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కోసం కండువాలు తెప్పించిన కాంగ్రెస్‌ నేతలు.. ఎమ్మెల్యేలు బాలి నుంచి ఎప్పుడు తిరిగి వస్తారా? అని ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 16 మందిని ఎలాగైనా లాగేసి విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తోంది. ఐతే కాంగ్రెస్‌ కలలు ఫలించే పరిస్థితి లేదని బీఆర్‌ఎస్‌ చెబుతోంది. పార్టీ అగ్రనేతలు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులతోపాటు మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌, హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వంటి వారిని టచ్‌ చేయలేరని… ఇలా పార్టీకి విధేయంగా సుమారు 15 మంది ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన ఆరేడుగురు ఊగిసలాటలో ఉన్నా… ఆపరరేషన్‌ బాలి తర్వాత వారు కూడా కారు దిగేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.

Also Read : ఎంత పని చేశావమ్మా..! ఐఏఎస్ అధికారి అత్యుత్సాహంతో చిక్కుల్లో రేవంత్ సర్కార్..! అసలేం జరిగిందంటే..