Gossip Garage : కాంగ్రెస్ టార్గెట్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు?

ఇలా ఈ నాలుగేళ్లు తెలంగాణ పాలిటిక్స్ నువ్వానేనా అన్నట్లుగానే సాగే అవకాశం కనిపిస్తోంది.

Ktr

Gossip Garage : ప్రభుత్వం మారి వన్ ఇయర్ కావొస్తుంది. మళ్లీ ఎన్నికలు జరగాలంటే ఇంకో నాలుగేళ్లు పట్టొచ్చు. కానీ తెలంగాణలో అప్పుడే హైఓల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ను కార్నర్ చేసేందుకు కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు గులాబీ పార్టీ.. స్కామ్ లు, కేసులు అంటూ హీటు పెంచుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ అంటుంటే.. ఇప్పుడు మీ పాలనలో స్కామ్ లు జరుగుతున్నాయంటూ ఛలో ఢిల్లీ అంటోంది బీఆర్ఎస్. దీంతో తెలంగాణలో రేపే ఎన్నికలు ఉన్నాయా అన్నంతగా పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. కాంగ్రెస్ టార్గెట్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎవరు? గులాబీ పార్టీ ఫిర్యాదులతో కాంగ్రెస్ స్కామ్‌ల కథ బయటికి వస్తుందా?

రేపే ఎన్నికలు అన్నంతగా పొలిటికల్ హీట్..
తెలంగాణలో హైవోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుండటంతో హామీల అమలు మీద ఒత్తిడి పెంచుతోంది బీఆర్ఎస్. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల లెక్క తేల్చే పనిలో పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్కామ్ లు, కేసులు అంటూ ఎత్తుకు పైఎత్తు రాజకీయాలు కొనసాగుతున్నాయి. రాకరాక అధికారం రావడంతో కాంగ్రెస్ నేతలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. సీఎం రేవంత్ తన కుటుంబ సభ్యులు, మంత్రి పొంగులేటి కంపెనీలకు అడ్డగోలుగా పంచి పెడుతున్నారని.. ఇదిగో ఆధారాలు అంటూ రంగంలోకి దిగింది బీఆర్ఎస్. దీంతో ఎన్నికలకు మరో నాలుగేళ్లు ఉండగానే..సినిమాలో క్లైమాక్స్ రేంజ్ లో తెలంగాణ పాలిటిక్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి.

ఢిల్లీ వెళ్లి కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు..
బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ జరిగిందని విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు సీఎం రేవంత్. తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కాక రేపుతూనే ఉంది. ఈ కేసులో లేటెస్ట్ గా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు..మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా కాంగ్రెస్ సర్కార్ దూకుడు మీద సాగుతుంటే… అమృత్-2 టెండర్లలో తెలంగాణ సర్కార్ అవినీతికి పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం ఆసక్తిరేపుతోంది.

బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం..
ఇక బీఆర్ఎస్ హయాంలో గొర్రెల స్కామ్ అంటూ విచారణ చేస్తూనే ఉంది ప్రభుత్వం. లేటెస్ట్ గా ఫార్ములా ఈ రేస్ కేసును తెరమీదకు తెచ్చి కేటీఆర్ ను కార్నర్ చేస్తోంది. కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం, భూదందా ఇలా అన్ని విషయాలపై బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే అపోజిషన్ గులాబీ పార్టీ కూడా అదే రేంజ్ రియాక్ట్ అవుతోంది. తమ మీద వస్తున్న ఆరోపణలకు వివరణలు ఇస్తూనే.. రేవంత్ సర్కార్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయంటూ దేశవ్యాప్తంగా ఎక్స్ పోజ్ చేసే ప్రయత్నం చేస్తోంది.

అమృత్ టెండర్లలో భారీగా అవినీతి?
అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ భారీగా అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించి తన బావమరిది సృజన్ రెడ్డికి చెందిన శోధా కంపెనీకి రూ.1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్కీం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ఉండటంతో ఆ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. అమృత్ స్కీమ్ టెండర్లలో రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వేల కోట్ల రూపాయల టెండర్లు అక్రమంగా కట్టబెట్టారని కేంద్రానికి ఫిర్యాదు చేసింది గులాబీదళం. ఇక అల్లుడి ఫార్మా కంపెనీ కోసం రేవంత్ కొడంగల్ ను బలి పెడుతున్నారంటూ తాజాగా కొత్త ఆరోపణలు మొదలు పెట్టింది బీఆర్ఎస్.

అధికారంలో ఉన్న కాంగ్రెస్..బీఆర్ఎస్ తప్పులు చేసిందని ఇరికించే ప్రయత్నం చేస్తుంటే..ఇప్పుడు జరుగుతున్న స్కామ్ ల కథేంటని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా రేవంత్ ను వదిలే ముచ్చటే లేదంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుంది?
మరోవైపు బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగాయంటూ కేసులు పెడుతూ అరెస్టులు అంటూ లీకులు ఇస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. ఇలా ఈ నాలుగేళ్లు తెలంగాణ పాలిటిక్స్ నువ్వానేనా అన్నట్లుగానే సాగే అవకాశం కనిపిస్తోంది. మీరు తప్పులు చేశారంటే..మీరు స్కామ్ లు చేస్తున్నారంటూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ..పొలిటికల్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి రెండు పార్టీలు. మరి ఈ రెండు పార్టీల ఆరోపణలపై కేంద్రం ఏ రకంగా రియాక్ట్ అవుతుందోననే చర్చ జోరుగా సాగుతోంది. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి ఎలా తీరుస్తుందో చూడాలి మరి.

 

Also Read : బీఆర్ఎస్ నేత కావాలనే కలెక్టర్ ను గ్రామంలోకి తీసుకెళ్లాడు, దాడి ఘటనలో కుట్రకోణం ఉంది- ఐజీ సత్యనారాయణ