RRR అలైన్‌మెంట్‌లో చిత్ర, విచిత్రాలు.. అడ్డగోలు మార్పులు వాటిని కాపాడేందుకేనా?

పనులు స్టార్ట్ కాకముందే పన్నెండు వంకలు తిరిగిన ట్రిపుల్ అలైన్‌మెంట్‌..పూర్తయ్యే సరికే ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందోనన్న టాక్ వినిపిస్తోంది.

Regional Ring Road Alignment: తెలంగాణకే ఐకాన్‌గా మారనున్న రీజినల్ రింగ్ రోడ్డు కాంట్రవర్సీకి కేరాఫ్ అయింది. అలైన్‌మెంట్ తెరమీదకు వచ్చినప్పటి నుంచి రచ్చ నడుస్తూనే ఉంది. తమకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వడం లేదని..తమ అంగీకారం లేకుండానే భూములు లాక్కుంటున్నారని రైతులు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నారు. కోట్ల విలువ చేసే భూమికి లక్షలు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తూ..ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ఆర్‌ భూసేకరణ తెగని పంచాయితీగా మారిపోయింది. అయితే రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయడానికి..ప్రభుత్వం దూకుడు పెంచడానికి పెద్ద రీజనే ఉందన్న చర్చ జరుగుతోంది. ట్రిపుల్‌ఆర్‌ సౌత్ సైడ్‌ అలైన్‌మెంట్‌ మార్చడమే ఈ రచ్చకు కారణమన్న టాక్ వినిపిస్తోంది.

రీజినల్ రింగ్ రోడ్డు..ప్రస్తుతం హైదరబాద్ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అవతల రానుంది. రాజధాని చుట్టూ..340 కి.మీ పొడుగునా ట్రిపుల్‌ఆర్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఔటర్ రింగ్‌ రోడ్డుకు..30 నుంచి 50 కి.మీ దూరంలో రెండు దశల్లో ట్రిపుల్‌ఆర్..నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా..రేవంత్ సర్కార్ ఫిక్స్ చేసిన రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ అలైన్‌మెంట్‌ ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అయింది.

గత ప్రభుత్వం ఫిక్స్ చేసిన అలైన్‌మెంట్‌లో ఇప్పుడు మార్పులు చేయడంపై హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. చౌటుప్పల్ నుంచి..అమన్ గల్, వికారాబాద్, చేవెళ్ళ మీదుగా..సంగారెడ్డి వరకు..సాగే ట్రిపుల్‌ఆర్ సౌత్ అలైన్‌మెంట్ మొదట 189 కి.మీ ఉండగా..ఇప్పుడు అది 201 కిలోమీటర్లకు పెరిగింది.

చౌటుప్పల్ దగ్గర ఓ ప్రైవేటు కంపెనీని కాపాడేందుకే?

చౌటుప్పల్ దగ్గర ఓ ప్రైవేటు కంపెనీని కాపాడేందుకు అలైన్‌మెంట్‌ మార్చడంతో భూసేకరణ డబుల్ అయిపోయిందట. అంతకముందు 67 ఎకరాలు సేకరిస్తే సరిపోయేదానికి ఇప్పుడు ఏకంగా 187 ఎకరాలు అంటే..ఇంకో 120 ఎకరాల భూమిని అదనంగా సేకరించాల్సి రావడం..అవన్నీ పేదల భూములే కావడంతో వివాదాస్పదం అవుతోంది.

దూరం పెరగడమే కాదు..ట్రిపుల్‌ఆర్‌ పన్నెండు వంకలు తిరగడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. ఒక చోట ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్‌ఆర్‌కు 30 కిలోమీటర్లు ఉంటే..మరో చోట ఏకంగా వంద కిలోమీటర్ల డిస్టన్స్ ఉంటుందట. ఇంకొన్ని చోట్ల 65కిలో మీటర్లు ఉంటుందట. ఇలా ఓ పద్దతి పాడు లేకుండా..ఎలాపడితే అలా అధికార పార్టీ నేతల సిఫారసులకు తగ్గట్లుగా ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్‌ మార్చుకుంటూ పోయారన్న అలిగేషన్స్‌ వినిపిస్తున్నాయి.

అధికార పార్టీ ముఖ్య నేత బంధువుల భూములు కాపాడేందుకే?

ట్రిపుల్‌ఆర్ సౌత్ అలైన్‌మెంట్‌ను అధికార పార్టీ నాయకుల ఎలా చెప్తే అలా మార్చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చౌటుప్పల్ నుంచి మొదలుకుంటే..సంగారెడ్డి వరకు..అధికార పార్టీ లీడర్లకు అనుకూలంగా..ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్‌ ఇష్టం వచ్చినట్లు మార్చేశారట. అమన్ గల్, మాడ్గుల రెవెన్యూ పరిధిలో..అధికార పార్టీ ముఖ్య నేత బంధువుల భూములు కాపాడేందుకు..అధికారులు విశ్వప్రయత్నాలు చేశారని..అందుకే అక్కడ రీజినల్ రింగ్ రోడ్ రూపమే మారిపోయే పరిస్థితి వచ్చిందంటున్నారు.

అదే విధంగా..నల్గొండలో రెవెన్యూ పరిధిలో ఓ కాంగ్రెస్ నేత వెంచర్‌కు నష్టం లేకుండా ట్రిపుల్‌ఆర్‌ను మలుపు తిప్పారట. దీంతో చిన్న, సన్నాకారు రైతుల తమ భూములు కోల్పోవాల్సి వస్తుందట. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతల భూములను కాపాడేందుకు ట్రిపుల్‌ఆర్‌ రూట్‌ మ్యాప్‌ను మారిస్తే..మరికొన్ని చోట్ల బడా వ్యాపారులు, లీడర్ల..రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు భూమ్‌ వచ్చేలా ట్రిపుల్‌ఆర్‌ను ఇష్టం వచ్చినట్లు అష్టవంకరలు తిప్పేశారట.

హైదరాబాద్ వెస్ట్‌కు దగ్గరలో ఉన్న చేవెళ్ళ, వికారాబాద్, సంగారెడ్డి రెవెన్యూ పరిధిలోకి వచ్చేసరికి..రీజినల్ రింగ్ రోడ్డు..మరింతగా మలుపులు తిరిగిందని టాక్. గతంలో చేవెళ్ళ, వికారాబాద్‌లో ఫిక్స్ చేసిన అలైన్‌మెంట్‌లో బిగ్ బ్రదర్స్ చక్రం తిప్పడంతో..ట్రిపుల్‌ఆర్‌ రోడ్డు స్ట్రక్చరే మారిపోయిందట. చేవెళ్లలో ఓ ముఖ్య నేత భూములు కోల్పోకుండా..అత్యంత జాగ్రత్తగా ట్రిపుల్‌ఆర్‌ను వంకర్లు తిప్పారట.

ఇక వికారాబాద్ జిల్లాలో..ముఖ్యనేత సూచనల ప్రకారం..అలైన్‌మెంట్ మార్పులు జరగడంతో..ఏకంగా 5 కి.మీ నుంచి 7 కి.మీ వంకర్లు తిరుగుతూ..వికారాబాద్ వైపు తిరిగిందట ట్రిపుల్‌ఆర్. దీంతో హస్తం పార్టీ ముఖ్యనేతల భూములను కాపాడేందుకు..పేదల భూములను లాక్కుంటున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇలా పనులు స్టార్ట్ కాకముందే పన్నెండు వంకలు తిరిగిన ట్రిపుల్ అలైన్‌మెంట్‌..పూర్తయ్యే సరికే ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందోనన్న టాక్ వినిపిస్తోంది.

Also Read: ఎవరైతే నాకేంటి? డోంట్ కేర్..! కాంట్రవర్సీకి కేరాఫ్‌గా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్..!