Sandeep Kumar Jha: ఎవరైతే నాకేంటి? డోంట్ కేర్..! కాంట్రవర్సీకి కేరాఫ్‌గా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్..!

ఏకంగా బీఆర్ఎస్ పింక్ బుక్‌లో నమోదైన తొలి పేరు సందీప్‌ కుమార్‌ ఝాదేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Sandeep Kumar Jha: ఎవరైతే నాకేంటి? డోంట్ కేర్..! కాంట్రవర్సీకి కేరాఫ్‌గా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్..!

Updated On : September 18, 2025 / 8:51 PM IST

Sandeep Kumar Jha: సందీప్ కుమార్ ఝా. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. ఈయన తీరు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. అధికారులన్నా..ప్రజా పతినిధులన్నా ఆయనకు లెక్కే లేదట. నేనే రాజు..నేనే మంత్రి అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట ఈ జిల్లా బాస్. ఇప్పటికే పలు కాంట్రవర్సీల్లో ఇరుక్కున్న కలెక్టర్‌ గారు..ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధినే లైట్ తీసుకుని మరోసారి వార్తల్లో నిలిచారు.

ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్.. తనకు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ సీఎస్, ప్రోటోకాల్ అధికారులకు కలెక్టర్‌పై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో జరిగిన కార్యక్రమానికి ఆది శ్రీనివాస్ హజరయ్యారు. జెండా వందనం ముగింపు దశలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చివరి నిమిషంలో వచ్చి సెల్యూట్ చేశారు. పైగా జనగణమన గీతం పాడుతున్నప్పుడు..ఎక్కడున్నారో అక్కడ ఉండిపోకుండా..కలెక్టర్‌ దర్జాగా కారు దిగి స్టేజ్‌ ఎక్కి సెల్యూట్‌ చేయడం వివాదాస్పదం అవుతోంది. జాతీయ గీతాన్ని అవమానించారంటూ సందీప్‌కుమార్ ఝాపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు వెళ్లాయి.

అధికార పార్టీ నేతలనే ఖాతరు చేయని కలెక్టర్..!

ముందుగా వచ్చి అతిథులను గౌరవించుకోవాల్సింది పోయి..ఆయనే అతిథిగా రావడం ఏంటంటూ గుసగుసలాడారు. విప్ ఆది శ్రీనివాస్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో..కలెక్టర్ తీరుపై సీఎస్‌కు, ప్రోటోకాల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆది శ్రీనివాస్‌కు మాట్లాడే అవకాశం కల్పించారు. అయితే అధికార పార్టీ నేతలనే కలెక్టర్ ఖాతరు చేయడం లేదంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ విప్ ఆది శ్రీనివాస్‌ను అవమానించారట కలెక్టర్. అతిథిగా వచ్చిన..ఆది శ్రీనివాస్‌ను కలెక్టర్, ఎస్పీ గౌరవంగా ఆహ్వనించడానికి రాలేదట. దీంతో ఆది శ్రీనివాస్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారట. ఇక తమ బీసీ నాయకుడిని కలెక్టర్ అవమానిస్తున్నారంటూ సిరిసిల్ల జిల్లా బీసీ సంఘాల నేతలు..సీపీకి కంప్లైట్ చేశారు.

ఇక మిడ్‌ మానేరు నిర్వాసితుడి పరిహారం విషయంలో కోర్టు ఆర్డర్స్‌ను కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మిడ్ మానేరు ప్రాజెక్ట్ నిర్మాణంలో తన ఇంటిన కోల్పోయిన చీర్లవంచకు చెందిన వేల్పుల ఎల్లయ్య.. నష్టపరిహారం కోసం అధికారులు, ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన ప్రయోజనం లేదని కోర్టుకెళ్తే..కొన్ని ఏళ్ల పోరాటం తర్వాత ఈ ఏడాది జూన్‌లో ఎల్లయ్యకు పరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు ఆర్డర్స్‌ను అమలు చేయకుండా లైట్‌ తీసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిహారం చెల్లించకపోవడమే కాదు..సమన్లు జారీ చేస్తే కనీసం కోర్టుకు హాజరుకాలేదు. కోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో చివరికి న్యాయమూర్తి కలెక్టర్‌పై వారెంట్ జారీ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది చెబుతున్నారు.

బీఆర్ఎస్ పింక్ బుక్‌లో నమోదైన తొలి పేరు సందీప్‌ కుమార్‌ ఝాదే?

గతంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు కూడా కలెక్టర్‌ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేటీఆర్ ఫోటో పెట్టుకుని టీ స్టాల్‌ను నడుపుతున్నాడని..ఓ హోటల్‌ను తొలగించడంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరు చర్చనీయాంశమైంది. కలెక్టర్ తీరుపై కేటీఆర్‌ కూడా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయిన సందర్భాలున్నాయి. ఏకంగా బీఆర్ఎస్ పింక్ బుక్‌లో నమోదైన తొలి పేరు సందీప్‌ కుమార్‌ ఝాదేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అయితే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి మరీ ఇబ్బంది పెడుతున్నారట. ఈ మధ్య కేటీఆర్ ముందే నరసింహమూర్తి అనే బీఆర్ఎస్ నాయకుడు తన ఆవేదనను చెప్పుకున్నారు. తన యావత్‌ ఆస్తిని పార్టీకి రాసిస్తానని..కానీ అధికారంలోకి వచ్చాక ఆ కలెక్టర్ కథేంటో చూడాలంటూ కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు నరసింహమూర్తి. అంటే ఆయన సదరు కలెక్టర్‌ తీరుతో ఎంత ఇబ్బందిపడుంటే ఆ మాట అని ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

కాంగ్రెస్ పాలనలో పలువురు ఐఏఎస్,. ఐపీఎస్‌ల తీరు వివాదాస్పదం అవుతోంది. ఆ మధ్య సివిల్ సప్లయ్స్‌ కార్పొరేషన్ కమిషనర్‌, ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహన్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇస్తుందనేలా వారు చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో బాగా ట్రోల్‌ అయ్యాయి. బీఆర్‌ఎస్‌ లీడర్లు కూడా గట్టిగానే రియాక్ట్‌ అయ్యారు. డీఎస్ చౌహాన్, ఐఏఎస్‌ దాసరి హరిచందన మాటలను అప్పట్లోనే తప్పుపట్టిన కేటీఆర్..అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు సరి చేస్తామని హెచ్చరించారు కూడా.

పోలీసులు కూడా అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటిస్తూ..బీఆర్‌ఎస్‌ శ్రేణులపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా అతి చేస్తున్న పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై డీవోపీటీకి కూడా కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ నేతలు. ఏదైనా కొందరు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా..మరికొందరు అయితే తామే ఓల్ అండ్ సోల్ అన్నట్లుగా బిహేవ్ చేస్తుండటం వివాదాస్పదం అవుతోంది.

Also Read: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కొత్త మలుపు.. నిందితుల్లో పెరిగిన గుబులు.. ఎందుకు..