Gossip Garage: పవర్ పోయింది. అపోజిషన్‌లోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తోంది. ఆ తర్వాత ఎన్నో ఆరోపణలు, మరెన్నో అలిగేషన్స్, అయినా సార్ మాత్రం సైలెన్స్‌గానే ఉంటూ వస్తున్నారు. కవిత లిక్కర్ కేసుపై ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ కాలేదు. కేటీఆర్ ఈ కార్ రేస్ కేసు విచారణ ఎదుర్కొంటున్నా అస్సలు స్పందించలేదు. తనకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినా మాట్లాడలేదు. ఇప్పుడు కూతురు రాసిన లేఖతో గాయిగత్తర లేస్తున్నా..నో రియాక్షన్ అంటున్నారు గులాబీ బాస్. మౌనమే అన్నింటికీ సమాధానం అనుకుంటున్నారా? సార్ సైలెన్స్ వెనుక స్ట్రాటజీ ఉందా.?
బీఆర్ఎస్. కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్న ఆ పార్టీ అధికారంలో ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా..25 ఏళ్లుగా లైమ్‌లైట్‌లో ఉంటూ వస్తోంది. 14 ఏళ్ల పోరాటం, 10 పదేళ్ల అధికారమంతా..బీఆర్ఎస్, కేసీఆర్ చుట్టే తిరిగింది. ఇప్పుడు ఏడాదిన్నరగా అసలు సిసలు అపోజిషన్ రోల్‌లో ఉన్న బీఆర్ఎస్ సెంట్రిక్‌గానే రాష్ట్రంలో రాజకీయ రచ్చ నడుస్తోంది. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త క్లిష్టమైన పరిస్థితులను ఫేస్ చేస్తోంది. అధికార పక్షం నుంచి కేసులు, ఆరోపణల బెడద ఓ వైపు ఉంటే..పార్టీలో ఇంటర్నల్ రచ్చ కాకరేపుతోంది. అయితే ఏం జరిగినా..ఎంత పెద్ద రచ్చ జరుగుతున్నా రెస్పాండ్ కాకపోవడం మాత్రం చర్చకు దారితీస్తోంది.
ఇంత రచ్చ జరుగుతున్నా ఎందుకు రెస్పాండ్ కావడం లేదు?
కవిత లెటర్ రాశారు. ఆ లేఖ బయటికి వచ్చింది. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ కోవర్టులు, దెయ్యాలన్న ప్రస్తావన తెచ్చారు. అంతటితో ఆగకుండా మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ నాతో పెట్టుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.
పైగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కుట్ర అన్నారు..అయినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు. ఇది ఒక్కటే కాదు చాలా విషయాల్లో కేసీఆర్ మౌనంగానే ఉంటూ వస్తున్నారు. ఏ విషయంలోనూ ఆయన పెద్దగా రెస్పాండ్ కావడం లేదు. పార్టీలో ఇంత హడావుడి నడుస్తున్నా ఆయన ఎందుకు రియాక్ట్ కావడం లేదో ఆ పార్టీ నేతలకు అస్సలు అంతు చిక్కడం లేదట.
కూతురు కవిత లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కోవడం, తీహార్ జైలుకు వెళ్లి రావడం జరిగినా కేసీఆర్ పెద్దగా స్పందించలేదు. కేటీఆర్ ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణను ఫేస్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఏసీబీ నుంచి పిలుపొచ్చింది. అయినా ఈ కార్ రేస్ కేసుపై కేసీఆర్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇక కాళేశ్వరం కమిషన్ ఏకంగా కేసీఆర్‌కే నోటీసులు జారీ చేసింది. జూన్ 5న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. ఎప్పటిలాగే కాళేశ్వరం కమిషన్ నోటీసులు, విచారణపై కూడా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేసీఆర్.
Also Read: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు..! కొండా సురేఖ స్థానంలో ప్రభుత్వ విప్‌కు అవకాశం..?
ఏడాదిన్నర కాలంగా ప్రతిపక్ష నేతగా మౌనంగానే..
మొన్నా మధ్య వరంగల్‌లో నిర్వహించిన పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన కేసీఆర్ మళ్లీ ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారు. ఏడాదిన్నర కాలంగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మౌనంగానే ఉంటున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్నప్పటి కంటే అపోజిషన్‌లో ఉన్నప్పుడే స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తుంటారు లీడర్లు. పైగా ప్రధాన పక్ష పార్టీ అధినేత, లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే రెగ్యులర్ ప్రెస్‌మీట్లు, అధికారాన్ని కార్నర్ చేయడం వంటివి ఉంటాయి.
అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటూనే అంతా నడిపించుకుంటూ వస్తున్నారు కేసీఆర్. అయితే ఇప్పటివరకు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఉందంటున్నారు పార్టీ నేతలు. కవిత లెటర్, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ఆమె చేసిన ఆరోపణలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నింటిపై కేసీఆర్ మాట్లాడితేనే అన్నింటికి తెరపడుతుందన్న అభిప్రాయం గులాబీ లీడర్ల నుంచి వినిపిస్తోంది.
కేసీఆర్ మౌనం.. బీఆర్ఎస్ కు లాభమా, నష్టమా?
కాంగ్రెస్, బీజేపీ విమర్శలకు చెక్ పెట్టాలంటే కేసీఆర్ నోరు తెరవాల్సిందే అంటున్నారు నేతలు. ఇదే సమయంలో కేసీఆర్ మౌనం కూడా ఓ వ్యూహమే అన్నది మరి కొందరు నేతల వాదన. మరోవైపు కేసీఆర్ సైలెన్స్‌గా ఉండటం బీఆర్ఎస్‌కు లాభమా.? నష్టమా.? అనేదానిపై పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారట.
కుటుంబంలో విభేదాలంటూ హడావుడి నడుస్తున్న టైమ్‌లో కేసీఆర్ మౌనంగా ఉండటం రాజకీయంగా పార్టీకి అంత మంచిది కాదంటున్నారు మరికొందరు లీడర్లు. అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా బాస్ స్పందించి అవసరమైతే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, లేదంటే ఈ వ్యవహారాన్ని తాడో పేడో తేల్చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీకి ఈ వ్యవహారం అస్త్రంగా మారుతుందని..అంది బీఆర్ఎస్‌కు నష్టం చేస్తుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.