Marri Janardhan Reddy: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ముందుచూపుతో సరికొత్త ప్లాన్ వేస్తున్నారట. నాగర్ కర్నూల్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన మర్రి జనార్ధన్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిన తర్వాత ఏడాది పాటు కాస్త టైం తీసుకున్న మర్రి..కొంత కాలంగా జిల్లాలో పుల్ యాక్టివిటీ పెంచారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారట. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మంత్రి కావాలని కూడా కలలు కంటున్నారు. అయితే ఆయనకు ఈ మధ్య కాలంలో ఒక డౌట్ వస్తోందట. అందుకే ప్యూచర్ ప్లాన్‌లో భాగంగా ఒక అదిరే స్కెచ్ వేశారట. ఆ ప్లాన్ లో భాగంగానే ఆడా ఉంటా..ఈడా ఉంటానంటున్నారట.
మర్రి జనార్ధన్ రెడ్డి వేస్తున్న ప్లాన్ ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. మర్రి ప్లాన్ ఏంటంటే.. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు తప్పవు. ముఖ్యంగా తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్‌గా మారే అవకాశాలున్నట్లు భావిస్తున్నారట. నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఎస్సీగా మారితే..తాను పోటీ చేయడానికి మరో సీటు వెతుక్కుంటున్నారట.
వాస్తవానికి 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సందర్భంలోనే నాగర్‌కర్నూల్ ఎస్సీగా మారాల్సి ఉండేనట. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని మండలాలను మార్పులు చేర్పులు చేసి..నాగర్ కర్నూల్ జనరల్‌గా ఉండేలా అప్పటి నేతలు చక్రం తిప్పారన్న ప్రచారం ఉంది. దీంతో అప్పుడు జనరల్ నియోజకవర్గంగా మారాల్సిన అచ్చంపేట.. మళ్లీ ఎస్సీ రిజర్వుడ్‌గా కంటిన్యూ అయ్యిందట. ఇక ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే..నాగర్ కర్నూల్ ఎస్సీగా మారి.. అచ్చంపేట జనరల్ సీటు అయ్యే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది.
అచ్చంపేట నియోజకవర్గం చాలా కాలంగా రిజర్వ్‌డ్ ఉండటంతో..ఈ సారి జనరల్ అయ్యే అవకాశాలున్నాయట. దీంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ముందుగానే కర్చీఫ్ వేస్తున్నారట. ప్రస్తుతం అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు పెద్ద నేతలు లేరు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ ఓడిపోగానే.. బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడిక్కడ నేతలు లేకపోవడంతో ఆ నియోజకవర్గాన్ని కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తన భుజాల మీదకు వేసుకున్నాడు. ఇప్పటి నుంచి అచ్చంపేటలో పర్యటనలు చేస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రిజర్వేషన్లు మారితే.. తనకు ఈజీ అవుతుందనే ప్లాన్ వేశారట. అందుకే వీలున్నప్పుడల్లా అచ్చంపేటలో పర్యటిస్తున్నారట.
లేటెస్ట్‌గా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు సన్మానం చేయాలని నిర్ణయించారు మర్రి జనార్ధన్ రెడ్డి. ఈ నెల 28న అచ్చంపేట, నాగర్‌కర్నూల్ రెండు నియోజకవర్గాల నుంచి సర్పంచ్‌లుగా గెలిచిన బీఆర్‌ఎస్ మద్దతుదారులకు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొత్తానికి ముందు చూపుతో మర్రి రెండు నియోజకవర్గాలపై ఫోకస్ చేయడం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. రిజర్వేషన్ మారితే అచ్చంపేటకు వెళ్లేలా.. లేకపోతే నాగర్‌కర్నూల్ నుంచే బరిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మర్రి ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Also Read: పెన్షన్లపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్..! పెంచేందుకు మాస్టర్ ప్లాన్..