Gossip Garage : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏ క్షణంలోనైనా అరెస్ట్ తప్పదా? అదే జరిగితే గులాబీ పార్టీని లీడ్ చేసేదెవరు? ఇప్పుడీ కొశ్చన్ బీఆర్ఎస్ క్యాడర్‌ను కలవరపెడుతోంది. కేటీఆర్ అరెస్ట్ నిజమైతే.. కారు స్టీరింగ్‌ను కవిత చేతిలో పెడతారా.. లేదంటే హరీశ్‌రావుకు అప్పగిస్తారా..
కారు స్టీరింగ్ ఎవరికి అప్పగిస్తారంటూ చర్చ..
అధికారంలో బీఆర్‌ఎస్ పార్టీ ఉన్నప్పుడు వేయి ఏనుగుల బలంతో కనిపించేది. కానీ పవర్ స్టీరింగ్ చేజారినప్పటి నుంచి కారు పార్టీకి ఎడ తెగని కష్టాలు మొదలయ్యాయి. అసలే వలసలతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇంత జరుగుతున్నా గులాబీ బాస్ కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నారు. ఇటువంటి సమయంలో బీఆర్‌ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తప్పేలా లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే వార్త పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే.. కారు స్టీరింగ్ ఎవరికి అప్పగిస్తారంటూ చర్చ మొదలైంది.
ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ నుంచి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దీంతో A1గా కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి.. వ్యక్తిగతంగా విచారణ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి కేటీఆర్‌ను అరెస్ట్ చేయవచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాదు అరెస్ట్ ఖాయమని కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ నేతలందరు మానసికంగా ప్రిపేర్ అయిన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో అమెరికాకు కూడా వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ టైమ్‌లో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే పార్టీ పరిస్థితి ఏంటనే టెన్షన్ అటు నేతల్లో, ఇటు కేడర్‌లో మొదలైందంట.
కేటీఆర్‌కు ప్రత్యామ్నాయంగా ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత, బావ హరీశ్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ పార్టీని సమర్ధవంతంగా లీడ్ చేయగలరని అధినేత కేసీఆర్ భావిస్తున్నారని గులాబీ పార్టీ ఇన్నర్ టాక్. అందుకే కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న కవితను మళ్లీ రంగంలోకి దింపారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓ వైపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం మొదలుపెట్టారు కవిత.
అన్ని విషయాల్లోనూ యాక్టీవ్‌గా కవిత..
బీఆర్ఎస్ వ్యూహంలో భాగంగానే కవిత అన్ని విషయాల్లోనూ యాక్టీవ్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మండలి సమావేశాల్లో కవిత ప్రతిపక్ష పాత్రలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో ప్రశ్నిస్తూ.. అవకాశం దొరికినప్పుడల్లా కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో మరో ముఖ్య నేత హరీశ్‌రావు సైతం పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో కేటీఆర్‌కు బదులు హరీశ్‌రావు ఎక్కుగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. అధికార పక్షానికి ధీటుగా సమాధానాలు ఇస్తూ చెలరేగిపోతున్నారు.
మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ ఐతే పార్టీ నేతలు, క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లకుండా ప్రత్యమ్నాయ మార్గాలతో బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇక కవితకు స్టీరింగ్ అప్పగిస్తే.. ఎలా డీల్ చేస్తుందనే డైలామా కూడా కొందరు నేతల్లో కనిపిస్తుంది. మరి గులాబీ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read : టాలీవుడ్‌ని రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిందా? కారణం అదేనా?