Gossip Garage : కేసీఆర్ త్రిముఖ వ్యూహం ఫలించిందా? ఇక వలసలు ఆగినట్లేనా?

ఇలాంటి రాజకీయ పరిణామాలున్నీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు ఆగిపోయేలా చేశాయట.

Gossip Garage KCR Strategy (Photo Credit : Google)

Gossip Garage : హడావుడి తగ్గింది. అంతా సైలెంట్ అయిపోయింది. జంపింగ్‌ల ఊసేలేదు. ఆ ముగ్గురికి తప్ప అందరికీ కండువా కప్పేస్తామన్న హస్తం పార్టీ డైలమాలో పడిందట. పోదామని గోడ మీదున్న లీడర్లు కూడా ఎందుకొచ్చిన బాధ అని కారులోనే ట్రావెల్‌ చేస్తున్నారట. వలసలతో ఉక్కిరిబిక్కిరి అయిన బీఆర్ఎస్ పార్టీకి రిలీఫ్‌ లభించిందట. ఇక గులాబీ వనం నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగినట్లేనా.? రేవంత్‌ వేసిన బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం స్కెచ్ వర్కౌట్‌ కానట్లేనా.?

బీఆర్ఎస్ స్కెచ్ తో వలసలకు చెక్..!
తెలంగాణలో ఫిరాయింపు పాలిటిక్స్ హడావుడి తగ్గిపోయింది. పార్లమెంట్ ఎన్నికల వరకు ఓ రేంజ్‌లో లాబీయింగ్ చేసి కారు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంది కాంగ్రెస్. ఆ తర్వాత వరుస పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరిపోతారని..ఇక ఆ పార్టీలో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ తప్ప ఎవరూ ఉండరంటూ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేతలు. ఆ ఫ్లోలో 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత వలసల జోరు ఆగిపోయింది. దానికి బీఆర్ఎస్ వేసిన స్కెచ్చే కారణమన్న చర్చ జరుగుతోంది. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత లేకపోవడం, ఇంకో వైపు అనర్హత వేటు భయంతో వెళ్లాలనుకున్న వారు కూడా బ్యాక్‌ స్టెప్‌ వేశారట.

వలసలకు అడ్డుకట్ట వేసేందుకు త్రిముఖ వ్యూహం..
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీఎల్పీ, తర్వాత సీఎల్పీలు విలీనం అయినట్లే బీఆర్ఎస్ఎల్పీ విలీనం అవుతుందని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేశారు. దీంతో అలర్ట్ అయిన గులాబీ పార్టీ.. నేతలు వలసలకు అడ్డుకట్ట వేసేందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలతో మాట్లాడి భరోసా కల్పించడం ఒక ఎత్తు. అయితే ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో దూకుడు పెంచేలా మరో వ్యూహాన్ని బీఆర్ఎస్ అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో జంపింగ్‌ ఎమ్మెల్యేలపై వేటు పడేలా న్యాయపోరాటం కొనసాగుతోంది. దీంతో బీఆర్ఎస్‌లోనే ఉండాలా..లేకపోతే జంప్ అవ్వాలా అని గోడ మీదున్న ఎమ్మెల్యేలు కూడా కారులోనే కంటిన్యూ అవుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గులాబీ పార్టీకి కలిసి వచ్చాయన్న చర్చ జరుగుతోంది.

దుమారం రేపిన ఇళ్ల కూల్చివేత..
మూసీ, హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను కూల్చివేయడం పెద్ద దుమారానికి దారి తీసింది. మూసీ బాధితులకు అండగా ఉండేలా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో నిరసనలు చేపట్టింది. గ్రేటర్ శాసనసభ్యులంతా ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలపైనా గులాబీ పార్టీ విరుచుకుపడుతుంది. రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని బలంగా వాయిస్ వినిపిస్తోంది. దీంతో పాటు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో గిరిజనులపై జరిగిన దాడి వ్యవహారం కూడా అధికార పార్టీకి కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది. అధికారులపై జరిగిన దాడి ఘటనలో గిరిజన రైతులను అరెస్టు చేసి వారిని చిత్రహింసలకు గురి చేశారని ఆరోపిస్తూ గులాబీ పార్టీ జాతీయస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంలో విజయవంతమవుతోంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకున్న కారు ఎమ్మెల్యేలు తమ నిర్ణయాలను మార్చుకున్నారని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు వెనకడుగు..!
బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని అధికార పక్షం అనుకుంటే 28మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అంటే ఇంకో 18మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లాగాల్సి ఉంటుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడిన పదిమంది శాసనసభ్యుల్లో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు తిరిగి గులాబీ పార్టీ నేతలకు టచ్‌లోకి వచ్చారన్న టాక్ వినిపిస్తోంది.

ఇలాంటి రాజకీయ పరిణామాలున్నీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు ఆగిపోయేలా చేశాయట. దీంతో గులాబీ పార్టీకి జంపింగ్‌ల బాధ నుంచి రిలీఫ్ లభించినట్లయిందంటున్నారు. కనీసం ఒక్క ఎమ్మెల్యే మీద వేటు పడినా ఫిరాయింపుల కథ ముగిసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్‌లోకి వెళ్లి మళ్లీ బీఆర్ఎస్‌లోకి వస్తామంటున్న ఎమ్మెల్యేల విషయంలో గులాబీ దళపతి నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

 

Also Read : కేసీఆర్‌ ఏం ప్లాన్‌ వేస్తున్నారు? దానికి రేవంత్ దగ్గరున్న విరుగుడు ఏంటి?