Duty With Helmets
Duty With Helmets – Karimnagar : ఎవరైనా హెల్మెట్ ఎప్పుడు పెట్టుకుంటారు అని అడిగితే.. బండి డ్రైవింగ్ చేసేటప్పుడు అని ఎవరైనా ఠక్కున సమాధానం చెబుతారు. ఇది చాలా కామన్. ఇందులో పెద్ద వింతేమీ లేదు. రోడ్డు మీద బైక్ పై వెళ్లేటప్పుడు సేఫ్టీ కోసం హెల్మెట్ ధరిస్తారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా మన ప్రాణాలను హెల్మెట్ కాపాడుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.
కానీ, ఆ ప్రభుత్వ ఆఫీసు ఉద్యోగులు మాత్రం బండి నడిపేటప్పుడే కాదు ఆఫీసుకి వెళ్లినప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు కూడా హెల్మెట్లు పెట్టుకుంటారు. హెల్మెట్ పెట్టుకునే విధులు నిర్వహిస్తారు. ఉదయం ఆఫీసులోకి అడుగు పెట్టింది మొదలు సాయంత్రం డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్లే వరకు అస్సలు హెల్మెట్ ని తియ్యరు. ఆఫీసులో ఉన్నంత సేపు తలకు హెల్మెట్ ఉండాల్సిందే. అయ్యో పాపం ఎందుకిలా అంటారా? తప్పదు మరి.. తల పగలకుండా ఉండాలన్నా, ప్రాణాలు కాపాడుకోవాలన్నా ఆఫీసులో ఉన్నంత సేపు ఇలా హెల్మెట్స్ ధరించాల్సిందే. లేదంటే, మాకు మూడినట్టే. ప్రాణాలు గాల్లో కలిసినట్లే అని ఉద్యోగులు అంటున్నారు.
ఇదీ..కరీంనగర్ జిల్లా బీర్పూర్ ఎంపీడీవో కార్యాలయంలో పని చేసే ఉద్యోగుల దయనీయ స్థితి. ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి వస్తోంది. కరీంనగర్ జిల్లా బీర్పూర్ ఎంపీడీవో కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. భవనం కూలిపోయే దుస్థితికి చేరుకుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read..peanuts packs : విమానంలో పల్లీలు ఎవ్వరు తినకూడదట, అందుకే ఆమె అన్నీ కొనేసింది..
ఆఫీసుని మరో భవనంలోకి మార్చాలని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. మరో దారి లేక తమ ప్రాణాలను కాపాడుకునేందుకు హెల్మెట్లు పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు ఉద్యోగులు. ఎప్పుడు ఏ పెచ్చు ఊడి మీద పడుతుందోనని, ఎప్పుడు ఆ భవనం కూలిపోతుందోనని భయపడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నట్లు ఉద్యోగులు వాపోయారు. వివిధ పనుల కోసం ఎంపీడీవో ఆఫీసుకి వస్తున్న ప్రజలు ఉద్యోగుల కష్టాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని, మానవతా కోణంలో ఆలోచన చేయాలని, ఆఫీసుని మరో భవనంలోకి మార్చి తమ ప్రాణాలను కాపాడాలని ఉద్యోగులు వేడుకుంటున్నారు.