వీడిన మర్డర్ మిస్టరీ, ప్రభుత్వ టీచర్ దారుణ హత్యకు కారణం రూ.కోటి అప్పు

మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ దారుణ హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తొలుత కారుతో ఢీకొట్టి, ఆపై కత్తితో మెడకోసి దారుణంగా చంపేశారు. ఈ మర్డర్ వెనుక మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని పోలీసులు తేల్చారు. తాను అప్పుగా ఇచ్చిన కోటి రూపాయలు తిరిగి అడగటమే టీచర్ పాలిట మృత్యువైంది.

Government Teacher Killed For Asking Money

government teacher killed for asking money: మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ దారుణ హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తొలుత కారుతో ఢీకొట్టి, ఆపై కత్తితో మెడకోసి దారుణంగా చంపేశారు. ఈ మర్డర్ వెనుక మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని పోలీసులు తేల్చారు. తాను అప్పుగా ఇచ్చిన కోటి రూపాయలు తిరిగి అడగటమే టీచర్ పాలిట మృత్యువైంది.

మహబూబ్‌నగర్‌లోని వైష్ణోదేవి కాలనీకి చెందిన నరహరి (40) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన భార్య అరుణకుమారి హన్వాడ మండలంలోని వేపూర్ జీహెచ్ఎంగా పనిచేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందిన జగదీశ్ అలియాస్ జగన్‌ పదేళ్ల క్రితం రాజేంద్రనగర్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం నరహరికి జగదీశ్ తో పరిచయం ఏర్పడింది. ఇది ఆర్థిక సంబంధాలకు దారితీసింది. ఈ క్రమంలో జగదీశ్‌కు దాదాపు కోటి రూపాయల వరకు నరహరి రుణంగా ఇచ్చాడు. డబ్బులు తిరిగి వెనక్కి ఇస్తానన్న సమయం మించిపోవడంతో జగదీశ్‌పై నరహరి ఒత్తిడి పెంచాడు.

డబ్బుల గురించి అడిగేందుకు బుధవారం(మార్చి 10,2021) సాయంత్రం జగదీశ్ ఇంటికి నరహరి వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి 12 గంటల వరకు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో బాలానగర్‌లో తనకు ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని జగదీశ్ హామీ ఇవ్వడంతో శాంతించిన నరహరి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో స్థానిక భగీరథ కాలనీ సమీపంలో ఆయన బైక్‌ను ఓ కారు ఢీకొట్టింది. కిందపడిన నరహరి మెడను కత్తితో కోసి దారుణంగా హత్య చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢీకొట్టిన కారు వివరాల గురించి ఆరాతీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కారు జగదీశ్‌దేనని తేలింది. నరహరిని కారులో వెంబడించి ఢీకొట్టి హతమార్చినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం వారిద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.