Greater Hyderabad Election : గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నటీఆర్ఎస్‌కు..వరద సహాయం కలిసి వస్తుందా..? ఆర్థిక సహాయం పంపిణీ వివాదాస్పదం ఎఫెక్ట్ ఎన్నికలపై పడనుందా..? ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఆస్తి పన్ను సవరణ నిర్ణయం పార్టీకి ఎంతవరకు కలిసి రానుంది..? మొత్తంగా ప్రభుత్వ నిర్ణయాలపై గ్రేటర్ ప్రజల స్పందన ఎలా ఉండబోతుంది..? ప్రస్తుతం ఈ అంశాలే గ్రేటర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
భారీ వర్షాలు : –
హైదరాబాద్ మహానగరాన్ని రెండు నెలల క్రితం భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రధానంగా నగర శివారు ప్రాంతాలతో పాటు ఓల్డ్ సిటీలోని పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకూ నీళ్లు వచ్చి చేరాయి. భారీ వర్షాలు ఆపై వరదలతో గ్రేటర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగర ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయంగా బాధిత కుటుంబాలకు పదివేల రూపాయలు అందజేయాలని నిర్ణయం తీసుకుంది.
550 కోట్ల రూపాయలు : –
ఇందుకోసం 550 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసింది. ఇల్లు కూలిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా ఇల్లు కోల్పోయిన వారికి 50 వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందినట్లు అధికార పార్టీ లెక్కలు వేస్తోంది. బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ మొదలుపెట్టిన కొన్ని రోజులకే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగింది. దీంతో ఆర్థిక సహాయం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఇది ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మారింది. ప్రస్తుతం ఈ అంశమే హాట్ టాపిక్‌గా మారింది.
ఆస్తి పన్ను సవరణ : –
అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం…ఆర్ధిక సహాయంతో పార్టీ అభ్యర్థులకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. దీనికి తోడు ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఆస్తి పన్ను సవరణ నిర్ణయంతో గ్రేటర్‌లో 13 లక్షలకు పైగా కుటుంబాలకు నేరుగా లబ్ది చేకూరనుంది. ఇప్పటికే పన్ను చెల్లించిన వారికి వచ్చే సంవత్సరం ఆస్తి పన్నులో సర్దుబాటు చేయాలనీ సర్కార్ నిర్ణయించింది. ఏటా 15 వేల రూపాయల లోపు పన్ను చెల్లించే వారికే ఇది వర్తించనుంది. ఈ నిర్ణయంతో కూడా మధ్య తరగతి ప్రజలకు ఆర్ధిక ఉపశమనం దక్కినట్లవుతుంది.
మేయర్ పీఠం : –
ఓ వైపు వరద సహాయం, మరోవైపు…ఆస్తి పన్ను..ఈ రెండింటి ద్వారా సుమారు 20 నుంచి 25 లక్షల మంది వరకు నేరుగా లబ్ధి చేకూరినట్లు అయిందని గులాబీ పార్టీ నేతల్లో చర్చలు మొదలయ్యాయి. ఎన్నికల్లో లబ్ధి పొందిన వారంతా తమకు అనుకూలంగా నిలిస్తే ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయన్న ధీమా గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ఆర్థిక సహాయం పంపిణీ వివాదాస్పదం కావడంపై అధికార పార్టీ నేతల్లో అనుమానాలు వెంటాడుతున్నాయి. మొత్తంగా…మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమనే ధీమా నేతల్లో ఉన్నప్పటికీ..ప్రభుత్వ నిర్ణయాలపై గ్రేటర్ ప్రజల స్పందన ఎలా ఉందన్న విషయం ఇప్పటికీ నేతలకు అంతు చిక్కడం లేదు.