Gulzar House Fire Incident: ఇరుకైన ప్రదేశం.. ఏసీల నిరంతర వాడకం.. గుల్జార్ హౌస్ ఘోర అగ్నిప్రమాదం వెనుక షాకింగ్ కారణం..

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై కమిటీకి తుది నివేదిక ఇవ్వనుంది ఎఫ్ఎస్ఎల్ క్లూస్ టీమ్.

Gulzar House Fire Incident: హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ ఘోర అగ్నిప్రమాద ఘటనకు కారణాలపై దర్యాప్తు బృందాలు ఓ నిర్ధారణకు వచ్చాయి. ఇరుకైన ప్రదేశంలో ఏడు ఏసీల నిరంతర వాడకం వల్లనే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఏసీ ఎగ్జాస్ట్ కు సరైన సౌకర్యం లేకపోవడంతో కంప్రెషర్ పేలినట్లు తేల్చారు. ఏసీ కంప్రెషర్ పై హెవీ లోడ్ కారణంగా ప్రమాదం జరిగినట్టు నిర్ధారణకు వచ్చాయి దర్యాఫ్తు బృందాలు. గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై కమిటీకి రేపు తుది నివేదిక ఇవ్వనుంది ఎఫ్ఎస్ఎల్ క్లూస్ టీమ్.

ఆదివారం తెల్లవారుజామున గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పాతబస్తీలో పెను విషాదాన్ని నింపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ప్రాథమికంగా అంచనా వేసినా.. తాజాగా ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు తేల్చారు. ఏసీ కంప్రెషర్ పేలి పోవటం వల్లే మంటలు చెలరేగి, క్షణాల్లోనే వ్యాపించినట్లు వెల్లడించారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర.. సిరాజ్ కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి..

కంప్రెషర్ పక్కనే విద్యుత్ మీటర్లు ఉండటం, చెక్కతో చేసిన మెట్లు కావటం, పార్కింగ్‌లో నిలిపి ఉంచిన వాహనం పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్.. ఇలా అన్నీ భారీ అగ్నిప్రమాదానికి కారణం అయ్యాయి. జీ+2 ఇంట్లో కింది అంతస్తులో ముత్యాల దుకాణం ఉంది. రెండో అంతస్తులో ప్రహ్లాద్ కుటుంబం నివాసం ఉంటుంది. మెుత్తం 10 గదులు ఉన్నాయి. 7 గదుల్లో ఏసీలు ఉన్నాయి.

ఆ ఇంటికి సరైన వెంటిలేషన్ లేకపోవటంతో ఏసీల వినియోగం పెరిగిందని.. ఎండా కాలంలో ఏసీలను విపరీతంగా వాడటం, కంప్రెషర్లు సైతం ఇరుకు సందులోనే బిగించటంతో వాటిపై ఒత్తిడి పెరిగి కంప్రెషర్ పేలినట్లు అధికారులు వివరించారు. గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండటం అత్యంత బాధాకరం. హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల్లో ఇంతమంది చనిపోవటం ఇదే తొలిసారి.