దమ్ముంటే.. గన్‌మెన్ లేకుండా అశోక్ నగర్, ఓయూకి రావాలి- సీఎం రేవంత్ కి హరీశ్ సవాల్

ఇది ఉద్యమాల గడ్డ. దబాయింపులకు తావు లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాకా కాంగ్రెస్ పార్టీ వెంటబడతాం.

Harish Rao Challenge Cm Revanth (Photo Credit : Google)

Harish Rao Challenge : తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ దగా చేసిందని ఆరోపించారాయన.

”అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాలు తిప్పి ప్రచారం చేసుకున్నారు. గద్దెనెక్కాక విద్యార్థులను మరిచిపోయారు. మొదటి క్యాబినెట్ లోనే జాబ్ క్యాలెండర్ అన్నారు. 8 నెలల తర్వాత ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో ఏమైనా ఉన్నదా? అసెంబ్లీలో స్టేట్ మెంట్ ఇస్తే ఎవరు ఇచ్చారు? అనేది ఉంటుంది. పేరు లేదు, సంతకం లేదు, ఒక చిత్తు కాగితం లాగా ప్రకటించారు. చర్చ కూడా లేకుండా ఉప ముఖ్యమంత్రి గారు చదివి పారిపోయారు. లక్షలాది మంది యువతీ యువకుల కంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా? చర్చ చేయమంటే ఎందుకు పారిపోయారు? దమ్ముంటే మాట్లాడాలి కదా?

దానం నాగేందర్ కు మైక్ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. మీకు మాట్లాడే ముఖం లేదు. మిమ్మల్ని వదిలి పెట్టం. నిరుద్యోగుల తరుపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. అభయ హస్తం మ్యానిఫెస్టోలో చెప్పినవి ఒక్కటీ అమలు చేయలేదు. రెండు లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. రేవంత్ రెడ్డి గన్ మెన్ లేకుండా అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీకి రండి. మీరు ఉద్యోగాలు ఇచ్చింది నిజమే అయితే దమ్ముంటే రావాలి. ఏ టైమ్ చెబుతారో, డేట్ చెబుతారో వస్తా. రావడానికి మీరు భయపడుతున్నారు. ఎన్ని రోజులు దాక్కుంటారు. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? యువతకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి.

రాహుల్ గాంధీ నీ క్రెడిబులిటీ ఏంటి. నువ్వు రా సమాధానం చెప్పు లేకుంటే నిరుద్యోగ యువతతో ఏఐసీసీ కార్యాలయానికి వస్తాం. అక్కడికి వచ్చి నిలదీస్తాం. హామీలు ఇచ్చి వెళ్లిపోయావు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వడం లేదు. ప్రజా ప్రభుత్వంలో అన్నీ ఆంక్షలే. అడిగితే కేసులు. ఉద్యోగాల గురించి అడిగితే కేసులు పెడతారా. ట్రోలింగ్ చేస్తారా? తెలంగాణ నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ దగా చేసింది. శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే. శాసనసభ కౌరవ సభగా మారింది. మహిళలు, రైతులు, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. గద్దెనెక్కినంక దగా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇది ఉద్యమాల గడ్డ. దబాయింపులకు తావు లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాకా కాంగ్రెస్ పార్టీ వెంటబడతాం. మేము ఇచ్చిన నోటిఫికేషన్లకే నియామకపత్రాలు ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా? దమ్ముంటే సమాధానం చెప్పండి” అంటూ విరుచుకుపడ్డారు హరీశ్ రావు.

ఉద్యోగాల విషయంలో అశోక్ నగర్ లో చర్చకు సిద్ధం- కేటీఆర్
జాబ్ క్యాలెండర్, దానం నాగేందర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బోగస్ జాబ్ క్యాలెండర్ తో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. క్యాలెండర్ లో డేట్ లు మారుతున్నాయి కానీ జాబ్ లు మాత్రం రావడం లేదన్నారు కేటీఆర్. మీరు ఇచ్చిన 2లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని.. రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ఉద్యోగాల గురించి మాట్లాడితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల విషయంలో అశోక్ నగర్ లో చర్చకు సిద్ధం అని కేటీఆర్ సవాల్ విసిరారు.

Also Read : కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనుక మతలబు ఏంటి.. సీఎం రేవంత్‌కి ఆగస్టు గండం అంటున్న బీఆర్ఎస్ ఆరోపణల్లో నిజమెంత?

 

ట్రెండింగ్ వార్తలు