లగచర్ల వాసులను తక్షణమే విడుదల చేయాలి: హరీశ్ రావు డిమాండ్

అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదని చెప్పారు.

BRS MLA Harish Rao

తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం అన్నదాతల ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి గత అర్ధరాత్రి కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై హరీశ్ రావు ఎక్స్‌ ఖాతాలో స్పందించారు.

ప్రభుత్వ తీరు అమానుషమని హరీశ్ రావు అన్నారు. లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమని తెలిపారు. ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వాళ్లను పోలీసులతో బెదిరించాలని చూడడం దారుణమని చెప్పారు. అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదని చెప్పారు.

ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని, ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశం తెలియాలని నిలదీశారు. సీఎం వ్యక్తిగత ప్రయోజనాలకోసం చేపడుతున్న భూసేకరణను తక్షణం నిలిపివేయాలని అన్నారు. పోలీసుల అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని ట్వీట్ చేశారు.

అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఆగ్రహం