Harish Rao
కృష్ణా జలాల అంశంలో బీఆర్ఎస్‌పై తెలంగాణ సర్కారు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. తెలంగాణకు ఉన్న హక్కును కూడా ఆంధ్రప్రదేశ్ కోసం త్యాగం చేశారని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. 299 టీఎంసీలే చాలంటూ, తెలంగాణకు ఉన్న హక్కును వదిలేసి ఆ నీటిని తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి ఇటీవల అన్నారు.
“బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు కృష్ణా బేసిన్‌కు సంబంధించి ఏ ప్రాజెక్టూ పూర్తి చేయలేదు. కేసీఆర్ సంతకాలు పెట్టి తెలంగాణను మోసం చేశారు. 811 టీఎంసీ నికర జలాలను ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే, రాష్ట్ర విడిపోయాక 2015లో కేసీఆర్ తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, ఏపీ 512 టీఎంసీలు తీసుకెళ్లాలని చెప్పి సంతకాలు చేశారు” అని రేవంత్ రెడ్డి అన్నారు.
దీనిపై 10టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో హరీశ్ రావు స్పందిస్తూ… “అబద్ధాల్లో రేవంత్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వచ్చు. దానిపై కేసీఆర్ సంతకాలు పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. దానిపై సంతకాలు పెట్టింది అధికారులు. అసలు ఈ 299 టీఎంసీలు అన్న లెక్క ఎక్కడి నుంచి వచ్చింది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 969 టీఎంసీలు అన్న గోదావరి లెక్కల నుంచి వచ్చింది. అప్పటి జీవోల లెక్కల ప్రకారం మొత్తం జలాలు 969 టీఎంసీలు. కాబట్టి ఆ రైట్ కోసం కొట్లాడాం. ఇక, అదే ఉమ్మడి ఏపీలో తెలంగాణకు కృష్ణానదిలో 299 టీఎంసీలకు సంబంధించిన జీవోలు మాత్రమే ఉన్నాయి.
అందువల్ల రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో 811లో 299 టీఎంసీల నీటి కేటాయింపుల జీవోలు ఉన్నాయి. ఏపీలో 511 ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపకానికి ట్రైబ్యునల్ ఉంది. ఆ ట్రైబ్యునల్ నీటిని పంచేదాక ఈ టెంపరరీగా పాత లెక్కను వాడుకున్నాం.
అయినా తెలంగాణలో ప్రాజెక్టే కట్టలేదు. కట్టిందే 299 టీఎంసీలకే ఉంది. ఎక్కువ తీసుకున్నా ఉపయోగించేది లేదు. అందుకే తాత్కాలికంగా ఈ లెక్కతో నీటిని వాడుకోవాలన్నాము. అయినా, ఈ 299 పాపం ఎవరిది? ఆనాటి కాంగ్రెస్ పాలకులది. అప్పట్లో తెలంగాణకు అన్యాయం చేయడం వల్ల కేవలం 299 కేటాయింపు జరిగింది” అని చెప్పారు.