గాంధీ భవన్ వద్ద వీళ్లు మోకాళ్లపై కూర్చున్నారు: వీడియో పోస్ట్ చేసిన హరీశ్ రావు

Harish Rao: అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని అన్నారు.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమంటూ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని ఏఈఈ అభ్యర్థులు నిరసన తెలుపుతున్న వీడియోను ఆయన పోస్ట్ చేశారు.

వారికి సంఘీభావం తెలుపుతున్నామని హరీశ్ రావు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసిందని హరీశ్ రావు చెప్పారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదని అన్నారు.

అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు