harish rao: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. దుబ్బాక మండలం రామక్కపేటలో మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతిపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. పదేళ్లు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం చేసింది అని ప్రశ్నించారు. బీజేపీకి రాష్ట్రంలో ఏముంది అని అడిగిన హరీష్ రావు, బీజేపీతో ఏమీ కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి తాగు, సాగునీరు ఇస్తోందన్నారు.
దుబ్బాకలో నీటి సమస్య తీర్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని మంత్రి హరీష్ చెప్పారు. మీ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామన్నారు. ఓట్ల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి లచ్చపేటలో ఉంటున్నారన్న హరీష్ రావు, రేపు ఓడిపోగానే ముల్లెమూట సర్దుకుని పోతారని విమర్శించారు. మోటార్లకు మీటర్లు పెట్టే బీజేపీ ఉండాలా? లేక రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ఉండాలో ఆలోచించాలని హరీష్ రావు ఓటర్లను కోరారు. మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండేది టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతనే అని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి సుజాతను గెలిపించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.