×
Ad

Harish Rao: సెబీ ఛైర్మన్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు 

అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

వాస్తవాలను దాచిపెట్టి, నిబంధనలను ఉల్లంఘిస్తూ కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ సెబీ (SEBI) ఛైర్మన్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు, ఆధారాలతో సెబీకి లేఖ రాశారు.

కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 10 వేల కోట్ల రూపాయల అప్పును టీజీఐఐసీ ద్వారా తీసుకున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ (Central Empower Committee) ఈ భూమిని అటవీ భూమిగా గుర్తించిందన్నారు. అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

Also Read: బిగ్ టాస్క్.. ఏపీలో జులై ఫస్ట్‌ నుంచి ఇంటింటికీ రాజకీయ‌మే..

ఈ వాస్తవాలను దాచిపెట్టి, భూమిని తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమని హరీశ్ రావు తెలిపారు. టీజీఐఐసీ వార్షిక ఆదాయం రూ.150 కోట్ల కన్నా తక్కువే అయినా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకోవడం ఆర్థిక అవకతవకల్లో పాల్పడటంలో భాగమేనని ఆరోపించారు.

ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడంలో పారదర్శకత లేదని హరీశ్ రావు చెప్పారు. సెబీ నియమ, నిబంధనలను ఇక్కడ పాటించారన్న విషయంలోనూ స్పష్టత లేదని తెలిపారు. రుణ సేకరణ కోసం మధ్యవర్తులకు రూ.169.83 కోట్లు బ్రోకరేజ్‌ చెల్లించారని విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

తెలంగాణ అటవీ సంపదను తాకట్టు పెట్టి, అడ్డదారుల్లో రుణాలు సేకరించిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, ఆర్థిక అవకతవకలను బయటపెట్టాలని సెబీకి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.