సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో రియాక్టర్ పేలుడుపై తెలంగాణ మాజీమంత్రి హరీశ్ రావు స్పందించారు. సిగచిలో పేలుడు సంభవించిందని, భూమి కంపించేంత శబ్దం వచ్చిందని అన్నారు. 149 మంది కార్మికులు ఉదయం పని చేశారని తెలిపారు. నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిందని, ఎనిమిది మంది చనిపోయారని చెప్పారు.
సహాయక చర్యలు వేగంగా చేపట్టలేదని హరీశ్ రావు విమర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందిస్తే ప్రాణాలు దక్కేవని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున ఏక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హరీశ్ రావు తెలిపారు. బిహార్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలుగు వాళ్లు కూడా బాధితుల్లో ఉన్నారని చెప్పారు. కంపెనీలో పనిచేసే వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఘటనపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రమాద ఘటనపై ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉందని హరీశ్ రావు తెలిపారు. ఎంత మంది చనిపోయారన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదని అన్నారు. డ్యూటీలో ఎంత మంది ఉన్నారనే విషయంపై ఒక్కొక్క అధికారి ఒక్కొక్క లెక్క చెబుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంతో ఉన్నారని అన్నారు.