బనకచర్ల అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో దీనిపై 10టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. తన ప్రయత్నం, తన బాధ్యత తెలంగాణ హక్కులను కాపాడడమేనని స్పష్టం చేశారు.
“ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఇది వివాదం. తెలంగాణ దృష్టిలో తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ. తెలంగాణ నీటి వాటాను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నేను మాట్లాడుతున్నాను. వివాదం సృష్టించడం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు. నా ప్రయత్నం, నా బాధ్యత తెలంగాణ హక్కులను కాపాడడం మాత్రమే” అని తెలిపారు.
మరోవైపు, 2016లో కేసీఆర్, చంద్రబాబు మధ్య జరిగిన సమావేశం తర్వాత అప్పుడు మొదలైన ప్రాజెక్టుకు ఇప్పుడు శంకుస్థాపన జరిగిందని వస్తున్న వాదనలపై హరీశ్ రావు స్పందిస్తూ… రేవంత్ రెడ్డి వద్ద సమాధానం లేని సమయంలో ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారని చెప్పారు. 2016లో ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో కేసీఆర్, చంద్రబాబు సభ్యులుగా సమావేశం జరిగిందని అన్నారు.
ఇందుకు సంబంధించిన అజెండానే రేవంత్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో చదివి వినిపించారని హరీశ్ రావు తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి మొదటి పేరా చదివి, ఐదో పేరా చదవలేదని చెప్పారు. అప్పటి మినట్స్‌లో రాసుకున్న మొదటి పేరాలో ఏముందో చెప్పారు.
“కృష్ణానది నుంచి వెయ్యి టీఎంసీల నీరు మాత్రమే వస్తుంది సరిపోవడం లేదు. గోదావరి నది నుంచి 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని మనం కృష్ణానదికి ఏ విధంగా తేవాలన్న విషయంపై ఇరు రాష్ట్రాలు మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలని అని కేసీఆర్ చెప్పారు.
ఇక్కడ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్‌ను నీరు తీసుకోవాలనిగానీ, ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్పారు అనిగానీ ఉందా? కృష్ణాలో నీళ్లు లేవు. గోదావరిలో ఉన్నాయి.. వీటిని ఎలా వాడుకోవాలన్న దానిపై ఇరు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఇందులో బంకచర్ల ముచ్చట ఎక్కడైనా ఉందా?” అని హరీశ్ రావు అన్నారు.
“ఐదో పేరాలోనూ కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. మీరు వేసిన ఎక్స్‌పర్ట్స్ కమిటీ సరిగ్గా లేదు. వాళ్లు పక్షపాతంగా ఉన్నారు. గోదావారి నీళ్లు కృష్ణాకు తీసుకెళ్లే విషయంలో మేము అంగీకరించము. తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోకుండా ఒక్క చుక్క నీళ్లు కూడా ఏపీ తీసుకుపోతే దానికి తెలంగాణ అంగీకరించదు అని ఐదో పేరాలో ఉంది. ఇందులో బనకచర్ల అంశం ఏమన్నా ఉందా?” అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ మినట్స్‌ను పట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఇందులో లేని విషయాన్ని చెప్పారని అన్నారు.