Hyderabad Greenery : ఇతర మెట్రో పాలిటిన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్.. గ్రీనరీకి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఢిల్లీతో పాటు ఇతర మెట్రో నగరాల్లో కాలుష్యం పెరిగిపోయి అక్కడ ఉండేందుకు కూడా జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే, హైదరాబాద్ మహానగరం మాత్రం పచ్చని వనంలా మారుతోంది.
బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై వంటి మహానగరాలు అర్బనైజేషన్ పేరుతో చెట్లను నరికి కాంక్రీట్ జంగిల్స్ గా మారుతుంటే హైదరాబాద్ మాత్రం ప్రకృతిని ప్రేమిస్తూ స్వచ్చమైన గాలిని పీల్చుకుంటోంది. దేశవ్యాప్తంగా అన్ని మహానగరాలతో పోల్చి చూస్తే దశాబ్ద కాలంలో హైదరాబాద్ లో గ్రీనరీ 147 శాతం పెరిగింది.
హైదరాబాద్ నగరంలో చెట్ల పెంపకం ఓ మహోద్యమంలా చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో 2011 నుంచి 2020 వరకు హైదరాబాద్ ఫారెస్ట్ విస్తీరణంలో 33 చదరపు కిలోమీటర్ల నుంచి ఏకంగా 82 చదరపు కిలోమీటర్లు పెరిగింది. అంటే పదేళ్లలో హైదరాబాద్ లో గ్రీనరీ 147శాతం పెరిగింది. గత దశాబ్ద కాలంలో కేసీఆర్ సర్కార్ తీసుకున్న విప్లవాత్మక చర్యల వల్లే ఈ ఘనతను సాధించామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విజనరీ లీడర్ షిప్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం వల్లే ఇది సాధ్యమైందన్నారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం హైదరాబాద్ పచ్చదనానికి ప్రతిరూపంలా మారిందన్నారు కేటీఆర్.
దేశ రాజధాని ఢిల్లీ సహా మిగతా నగరాల్లో పరిస్థితి హైదరాబాద్ కు భిన్నంగా ఉంది. 2011 నుంచి 2020 వరకు అహ్మదాబాద్ నగరంలో సగానికి సగం చెట్లు తగ్గిపోయాయి. కోల్ కతాలో 30శాతం, బెంగళూరులో 5శాతం గ్రీనరీ తగ్గింది. చెన్నై, ఢిల్లీ, ముంబై నగరాల్లో చెట్ల పంపకం కొద్ది మేర పెరిగినా అది నామమాత్రమే. తెలంగాణ ప్రభుత్వం మాత్రం చెట్ల పెంపకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
పట్టణ జనాభాకు తగినట్లుగా ఆహ్లాదకర వాతావరణంతో అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ హరితహారం కార్యక్రమం నిర్వహిస్తోంది ప్రభుత్వం. దీని ద్వారా పర్ కేపిటా ఆఫ్ ఫారెస్ట్ కవర్ 4.3 నుంచి 8.2 చదరపు మీటర్లకు పెరిగింది.