Musi River
Musi River Flood : హుస్సేన్ సాగర్ నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. 5వేల 800 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. దీంతో మూసీ కాలువలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం
చేసింది. ముందస్తుగా చాదర్ ఘాట్, శంకర్ నగర్, ముసారాంబాగ్ ప్రజలని అలర్ట్ చేసింది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు పోటెత్తింది.
కొన్ని రోజులుగా హిమాయత్ సాగర్ తో పాటు హుస్సేన్ సాగర్ నుంచి వరద నీరు ఎక్కువగా మూసీలోకి వస్తోంది. ప్రధానంగా హిమాయత్ సాగర్ నుంచి 4వేల క్యూసెక్కుల వరద నీరు ఉదయం విడుదల చేశారు. దానికి మరో 2వేల క్యూసెక్కుల నీరు కలిసింది. హుస్సేన్ సాగర్ నుంచి వచ్చే వరద నీటితో పాటు అలుగుల నుంచి మరో 3వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.
మొత్తం 7వేల నుంచి 9వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దాంతో మూసీ చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. మురుగు, వ్యర్ధాలు కలవడంతో నీరు చాలా నల్లగా ఉంది. మరికాసేపట్లో వరద నీరు ముసారంబాగ్ బ్రిడ్జిని టచ్ చేస్తూ ప్రవహించే అవకాశం ఉంది. బ్రిడ్జిని తాకడానికి ఇక అర అడుగు తేడా మాత్రమే ఉంది. ఇంకా కొంచెం ఉధృతంగా వరద వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అదే కనుక జరిగితే.. బ్రిడ్జిపైన రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఎగువున ఉన్న మహారాష్ట్రతో పాటు క్యాచ్ మెంట్ ఏరియాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెల్లడించారు.
కాగా.. తెలుగు రాష్ట్రాలకు మరో 24 గంటలు వర్షాలు తప్పవని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయంది.
Also Read..Kadem Project: టెన్షన్ పెడుతున్న కడెం ప్రాజెక్టు.. గేట్లు తెరుచుకోకపోవడంతో ఆందోళన
ఇక, సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్నాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. 13 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.