Telangana Rain : తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మంగళవారం(జూలై 6,2021) అక్కడక్కడ భారీవర్షాలు కురవచ్చని...

Telangana Rain : తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో సోమవారం ఓ మాదిరిగా వర్షాలు పడతాయంది. మంగళవారం(జూలై 6,2021) అక్కడక్కడ భారీవర్షాలు కురవచ్చని వాతావరణశాఖ తెలిపింది. కాగా, ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ 90 ప్రాంతాల్లో వానలు పడ్డాయి. అత్యధికంగా వెల్దండ(నాగర్‌కర్నూల్‌ జిల్లా)లో 4.8, వెలిజాల(రంగారెడ్డి)లో 3.8, చలకుర్తి(నల్గొండ)లో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

మరోవైపు పలు ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఆదివారం సత్యనారాయణపురం(భద్రాద్రి జిల్లా)లో 38.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

కొద్ది రోజులు మందగించిన నైరుతి రుతుపవనాలు ఈనెల 8 నుంచి తిరిగి చురుగ్గా మారే అవకాశం ఉందని కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవన్‌ తెలిపారు. బంగాళాఖాతంలో ప్రస్తుతమున్న వాతావరణ వ్యవస్థ ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్టు చెప్పారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలోని పశ్చిమ తీరం, తూర్పు మధ్య ప్రాంతాల్లో వర్షాలు పడతాయన్నారు. మొత్తంగా జులైలో దేశవ్యాప్తంగా వర్షపాతం సంతృప్తికరంగా(94 నుంచి 106 శాతం) ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు