హైదరాబాద్ కు భారీ వర్ష సూచన, జీహెచ్ఎంసీ అలర్ట్, ప్రజల్లారా బయటకు రాకండి

  • Publish Date - October 21, 2020 / 07:19 AM IST

Heavy rain forecast for Hyderabad, GHMC alert : 
వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు తరలించారు. భాగ్యనగరానికి భారీ వర్ష సూచన ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తిచేశారు.



50 బోట్లు : – 
వరద సహాయక చర్యల కోసం వివిధ రిజర్వాయర్ల వద్ద ఉన్న పర్యాటక శాఖ బోట్లను హైదరాబాద్‌ తెప్పించారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతి వద్ద దాదాపు 50 బోట్లను సిద్ధంగా ఉంచారు. వీటికి తోడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పర్యాటక శాఖకు చెందిన 5 బోట్లను, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని పంపింది.

డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ : – 
వరదల పరిస్థితిపై 15 మంది సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో భారీ వ‌ర్షాలు కురుస్తాయని జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ విశ్వజిత్‌ ప్రకటించారు. నగర ప్రజలు ఇళ్లల్లో నుంచి బ‌య‌ట‌కు రావొద్దని ఆయ‌న హెచ్చరించారు. రోడ్లపై నీరు నిల్వకుండా డీఆర్ఎఫ్ బృందాల‌ను అప్రమ‌త్తం చేశామ‌ని తెలిపారు.



కేటీఆర్ పర్యటన : –
ఇక- ఖైర‌తాబాద్‌లోని ఎంఎస్ మ‌క్తా, రాజు న‌గ‌ర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. GHMC పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, అధికారులతో సమీక్ష నిర్వహించిన కేటీఆర్‌… వారికి కీలక సూచనలు చేశారు.

తక్షణ సాయం అందించాలి : – 
ప్రతీ ఎమ్మెల్యే వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సీఎం ప్రకటించిన తక్షణ సాయం అందేలా చూడాలన్నారు. GHMC పరిధిలోని పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి.. వరద బాధితులకు భరోసా కల్పించాలన్నారు. నగరంలో శానిటేషన్ పనులు వేగవంతం చేయాలని అధికారుల్ని కేటీఆర్‌ ఆదేశించారు.



జంట జలాశయాలకు వరద నీరు : –
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు వరద పోటెత్తుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు హిమాయత్‌సాగర్‌ జలాశయం 1,763 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి వరద నీటిని మూసీలోకి వదిలిపెట్టారు.



గరిష్ట నీటి మట్టం : –
ఈ జలాశయంలోకి 1,200 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరినట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఇక పక్కనే ఉన్న ఉస్మాన్‌సాగర్‌ గరిష్ట నీటిమట్టం 1,790 అడుగులు అయితే… ప్రస్తుతం 1,786.110 అడుగుల మేర వరదనీరు చేరింది. త్వరలో ఈ జలాశయం కూడా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.