Heavy Rain : హైదరాబాద్‌ లో భారీ వర్షాలు..మూసీ పరీవాహక ప్రాంతంలో అలర్ట్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌పై వరుణుడు పగబట్టాడు. నగరంలోని విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేకుండా నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షాలకు...లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Heavy rain in Hyderabad : గ్రేటర్‌ హైదరాబాద్‌పై వరుణుడు పగబట్టాడు. నగరంలోని పలు డివిజన్లలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేకుండా నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షాలకు…లోతట్టు ప్రాంతాలు మళ్లీ జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా కురిసిన వర్షాలకు.. మూసీలో వరద ప్రవాహం పెరిగింది.

మూసీ పరీవాహక ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే లంగర్‌హౌస్‌, గోల్కొండ, మెహిదీపట్నం, అంబర్‌పేట, చాదర్‌ఘాట్‌, మూసారాంబాగ్‌లో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. నగరంలోని కుర్మగూడలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వర్ష బీభత్సంతో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూసీనది పొంగిపొర్లడంతో మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై వరద పోటెత్తింది. ట్రాఫిక్‌ దారి మళ్లించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సరూర్‌నగర్‌ చెరువు ఉగ్రరూపం దాల్చడంతో మళ్లీ వీధులన్నీ నదుల్ని తలపించాయి. చెరువులో కలుషిత వ్యర్థాలు దూసుకురావడంతో నురగ తేలింది. మోకాలి లోతు ప్రవాహం దూసుకురావడంతో చెరువును ఆనుకుని ఉన్న కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోదండరామ నగర్‌లోని కాలనీలన్నీ జల దిగ్బంధమయ్యాయి. దీంతో నిద్రలేని రాత్రి గడిపారు స్థానికులు.

హైదరాబాద్‌లో కురిసిన భారీవర్షాలకు… ఉస్మాన్‌సాగర్‌ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయానికి వరద పెరిగింది. నీటి ప్రవాహం పూర్తిస్థాయికి చేరడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ..ఉస్మాన్‌సాగర్‌ నాలుగు గేట్లు ఎత్తారు. రెండు అడుగులమేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు.

ట్రెండింగ్ వార్తలు