భారీ వర్షాలతో స్కూళ్లకు సెలవు

  • Publish Date - October 22, 2019 / 04:19 AM IST

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో స్కూళ్లు, కాలేజీలను అక్టోబరు22,మంగళవారం మూసివేశారు. రామనాథపురం, కోయంబత్తూరు, కన్యాకుమారితో సహా పలు జిల్లాల కలెక్టర్లు  పాఠశాలలకు సెలవు ప్రకటించారు.  

భారీ వర్షాలతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్ధంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

నీలగిరి, కోయంబత్తూర్‌, థేని, దిండిగల్‌ జిల్లాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. రాగల అయిదు రోజుల్లో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.