Two People Swept Away : తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగూడెం పట్టణం ముర్రెడు వాగు ఉధృతికి 5 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కొత్తగూడెం పట్టణం లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. చింతల చెరువు ఉప్పొంగటంతో కొత్తగూడెం హైవేపై జల ప్రవాహం సాగుతోంది. విద్యానగర్ కాలనీకి వరద ముప్పు పొంచి ఉంది.
కొత్తగూడెం ఎస్సీ కాలనీలో వరద నీటితో ఇళ్లలోకి పాములు వచ్చాయి. పెనుబల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొత్తగూడెంతో గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి. లక్ష్మిదేవి పల్లి మండలంలోని సీతారంపురం వద్ద నల్లవాగు ఉధృతికి ఆటో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు.
సుజాతనగర్ సింగభూపాలెం ప్రాజెక్టు అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
అలుగుపై నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. పంట పొలాలు నీట మునిగాయి. సుజాతనగర్ మండలంలో ఎదుళ్ళ వాగు, పెద్ద వాగు, చిన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జూలూరుపాడు మండలంలో తుమ్మల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జూలూరుపాడులోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. కాకర్ల అనంతారం మధ్య వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు రాకపోకలను నిలిపి వేశారు.
చండ్రుగొండ మండలం చండ్రుగొండ నుండి సీతాయి గూడెం వెళ్లే మార్గంలో ఎదుళ్ళ వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. చండ్రుగొండ మండలం పోకల గూడెం నుండి బాల్య తండా మధ్యలో వాగు చప్టాపై నుండి ప్రవహిస్తుండడంతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. అన్నపురెడ్డి పల్లి మండలం అన్నపురెడ్డి పల్లి, రాజాపురం గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కుండ పోత వర్షం కురిసింది. కొన్ని కోట్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయింది. కరకగూడెంలో 22.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. సత్యనారాయణపురంలో 14.4సెంటీమీటర్లు, సుజాత నగర్ లో 13.8 సెంటీమీటర్లు, ఈ బయ్యారంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. పాత కొత్తగూడెంలో 13.4 సెంటీమీటర్లు, ఇల్లందులో 11.8 సెంటీమీటర్లు, మణుగూరులో 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొత్తగూడెంలోని నల్లవాగు ఉఫ్పొంగి 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు బ్రిడ్జీ పైనుంచి ప్రమాదకర ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతోపాటు గోదావరి కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఏదైనా సహాయం కావాల్సి వస్తే పోలీసులకు ఫోన్ చేయాలని తెలిపారు. కిన్నెరసాని ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వస్తోంది. 82 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 10 గేట్లు ఎత్తి 57 వేల క్యూసెక్కుల నీటినిదిగువ విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా, ప్రస్తుతం 404 అడుగులకు చేరుకుంది. నాగారం బ్రిడ్జీ వద్ద కిన్నెరసాని ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాల్వంచ, భద్రాచలం మధ్య రాకపోకలను నిలిపి వేశారు.
మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం నీటి మట్టం 50.20 అడుగులకు చేరింది. రెండు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఔటో ఫ్లో 12 లక్షల 65 వేల, 653 క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాలతోపాటు ఎగువ నుంచి వరద వస్తోంది. ఇప్పటికే భద్రాద్రి రామాలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. విస్తా కాంప్లెక్స్, అన్నదానం సత్రం నీట మునిగిపోయాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడటంతో పరివాహక ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.