Telangana Rains
Hyderabad Rains: నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు.. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ద్రోణి ప్రభావంతోపాటు రుతుపవనాల ప్రభావంతో మూడ్రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, గురువారం ఉదయం హైదరాబాద్ లో వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండగా.. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. అయితే, వేసవి ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు గురువారం ఉదయం వర్షంకుతోడు చల్లటి వాతావరణం కాస్త ఉపశమనం కలిగించినట్లయింది.
ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ సహా మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, అదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వార్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే అవకాశం ఉండటంతో వర్షంపడే సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించారు.