Heavy Rains in Telangana
Heavy Rains in Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. గత పదిరోజులుగా పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే, మరో వారం రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. గురువారం నాటికే దీని ప్రభావం ఉండగా.. శనివారానికి ఇది వాయుగుండంగా మారనుందని, ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 30వ తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈనెల 26, 27తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 26న తెలంగాణలోని 18 జిల్లాలో పలు చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా 27వ తేదీన అదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈనెల 27వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో తీరందాటనుందని, ఈ వాయుగుండం ప్రభావంతో 30వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదిలాఉంటే.. ఇవాళ (గురువారం) అదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
రేపు (శుక్రవారం) నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.