Weather Updates: మరో అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..! 3రోజులు ఈ ప్రాంతాల్లో వానలే వానలు..!

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Weather Updates: మరో అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..! 3రోజులు ఈ ప్రాంతాల్లో వానలే వానలు..!

Heavy Rains

Updated On : September 24, 2025 / 7:37 PM IST

Weather Updates: ఏపీని వరుణుడు వెంటాడుతున్నాడు. రాష్ట్రంలో వానలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. తాజాగా మరోసారి ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ఎల్లుండికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంబడి వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. శనివారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయన్నారు. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ దగ్గర ఉండరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొంగి పొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.

రానున్న మూడు రోజులు వాతావరణం ఈ విధంగా ఉండే అవకాశం..

గురువారం (25-09-2025) :
* పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం.
* శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్.
* మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

శుక్రవారం (26-09-2025) :
* పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.
* శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
* మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్.

శనివారం (27-09-2025) :
* ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.
* గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం.
* శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్.

కృష్ణా నది వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.55 లక్షల క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. మొదటి హెచ్చరిక కొనసాగుతోందన్నారు. రేపటికి 5 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు.

మరోవైపు గోదావరి వరద ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 3.97 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. భారీ వర్షాలను బట్టి ఈ నెల 28 నాటికి క్రమంగా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. నదీ పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Also Read: ఏపీలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో స్థానిక ప్రజలు.. ఆ ప్రాంతంలో తీవ్రత ఎక్కువ..