Rain Alert
Weather Updates: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశ ఉందని ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ శ్రీనివాస్ 10టీవీకి తెలిపారు. ఇవాళ సాయంత్రం, రాత్రి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
ఈశాన్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, అది ఇవాళ ఉదయం వెస్ట్ బెంగాల్, ఒడిశా పరిసరాల్లో తీరాన్ని దాటిందని అన్నారు. దాని నుంచి ఒక ద్రోణి తెలంగాణ మీదుగా, మరో ద్రోణి తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా కొనసాగుతోందని వివరించారు. ఈ రెండింటి వల్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు. (Weather Updates)
Also Read: హనుమాన్ పై ట్రంప్ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా..
అలాగే, కొన్ని రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని తెలిపారు. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్లే ఇలా జరుగుతోందని చెప్పారు. అంటే సిటీలు పెరిగిపోయి, భారీ నిర్మాణాలు జరిగి, లక్షలాది వెహికల్స్ తిరుగుతుండటం వల్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయని అన్నారు.
ఉపరితల చక్రవాత ఆవర్తనాలు ఏర్పడుతున్నప్పుడు బాగా ముసురు పట్టిన వాతావరణం ఉండి, నాలుగైదు రోజులు వరుసగా వానలు పడతాయని చెప్పారు. రాగల నాలుగైదు రోజుల వాతావరణాన్ని అంచనా వేసి చూస్తే.. 25వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని అన్నారు. 27వ తేదీ నాటికి కోస్టల్ ఆంధ్రప్రదేశ్, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించారు. ఈ నెల 25, 26, 27న కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్నారు.