హైదరాబాద్‌లో హై అలర్ట్.. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తం.. తనిఖీలు..

Hyderabad: రామేశ్వరం కేఫ్‌లో పేలుడుపై జాతీయ దర్యాప్తు బృందం సోదాలు నిర్వహిస్తోంది.

బెంగళూరులోని రాజాజీనగర్‌ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించి తొమ్మిది మందికి గాయాలు కావడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రామేశ్వరం కేఫ్‌లో పేలుడుపై జాతీయ దర్యాప్తు బృందం సోదాలు నిర్వహిస్తోంది.

హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. ఇవాళ సాయంత్రం నగరంలో హైఅలెర్ట్‌ ప్రకటించామని అన్నారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు వివరించారు. అలాగే, బెంగళూరులో కేఫ్‌ పేలుడు కారణాల గురించి వివరాలు తీసుకుంటామని చెప్పారు.

ఓ బ్యాగులో పెట్టుకువచ్చిన పదార్థాలే పేలుడికి కారణమని సమాచారం. గాయపడ్డ తొమ్మిది మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టింది. అది గ్యాస్ పేలుడు కాదని ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. రామేశ్వరం కేఫ్‌ వద్ద ఎల్లప్పుడు ర ద్దీ ఎక్కువగా ఉంటుంది.

తొలుత బ్లాస్ట్‌కి సిలిండర్లు కారణమని అంతా భావించారు. అయితే బాంబ్‌ స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ టీం సేకరించిన ఆధారాలతో పాటు.. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా కీలక విషయాన్ని గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాగ్‌ను హోటల్‌లో వదిలి వెళ్లినట్లు గుర్తించారు. అందులోని టిఫిన్‌ బాక్స్‌లోని IED పేలుడుకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు.

పేలుడు జరిగిన రామేశ్వరం కేఫ్‌ను డీజీపీ అలోక్‌ మోహన్‌ సందర్శించారు. స్థానిక అధికారులను అడిగి పేలుడుకు గల కారణాలు తెలుసుకున్నారు. పేలుళ్ల నేపథ్యంలో రంగంలోకి దిగిన NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. సీసీ ఫుటేజీ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.

Also Read: అందుకే జనసేనకు రాజీనామా చేసి.. వైసీపీలో చేరాను: చేగొండి సూర్యప్రకాశ్

ట్రెండింగ్ వార్తలు